TG HIGH COURT: 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల

TG HIGH COURT: 11 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల
X
తల్లిని హత్య చేశాడని 11 ఏళ్ల క్రితం పోచయ్య అరెస్ట్... నిర్దోషిగా విడుదల చేసిన తెలంగాణ హైకోర్టు

2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని హత్య చేశాడన్న కేసులో పోచయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో పోచయ్యను 11 ఏళ్ల తరువాత తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన పోచయ్యకి ఈ కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోకూడదని స్పష్టం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే...

తల్లిని హత్య చేశారన్న నేరంపై 2013లో అరెస్టయి జైలుకెళ్లిన వ్యక్తి 11 ఏళ్ల తరువాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యారు. మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లికి చెందిన పెద్దగుండెల్లి అలియాస్‌ పెద్దగుండేల పోచయ్యకి యావజ్జీవ శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. చట్టపరమైన, ఆమోదయోగ్యమైన సాక్ష్యాలు లేనపుడు కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోకూడదని స్పష్టం చేసింది. 2013 ఫిబ్రవరి 1న 80 ఏళ్ల తల్లిని చెట్టుకు టవల్‌తో ఉరి వేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తల్లి అనారోగ్యంతో విసిగిపోయి చంపేసినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడంటూ పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగపత్రం దాఖలు చేశారు. దీనిపై సిద్దిపేట కోర్టు విచారణ చేపట్టి హత్య, సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై 2015 జనవరి 12న యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పోచయ్య హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు.

దీనిపై ఇటీవల జస్టిస్‌ కె.సురేందర్, జస్టిస్‌ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘కింది కోర్టు గ్రామానికి చెందిన వారితోపాటు వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా శిక్ష విధించింది. వాస్తవానికి వైద్యుడు వృద్ధురాలిది హత్యా.. ఆత్మహత్యా అనేది స్పష్టంగా చెప్పలేదు. ఇక్కడ వైద్యుడి సాక్ష్యం కీలకం. ఒకవేళ ఆత్మహత్య అయితే హత్య అన్న ప్రశ్నే తలెత్తదు. హత్య కారణంగానే వృద్ధురాలు మృతిచెందారని ప్రాసిక్యూషన్‌ తేల్చాలి. కనీసం ఆధారంగా చూపిన టవల్‌తో చంపారని కూడా స్పష్టత ఇవ్వలేదు. వైద్యుడు కచ్చితంగా చెప్పనపుడు ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడవచ్చు. కానీ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు లేరు. సీఆర్‌పీసీ 161 వాంగ్మూలాలు, నేరాంగీకార వాంగ్మూలం ఆధారంగా కింది కోర్టు శిక్ష విధించింది.

ఇవి విచారణ సమయంలో సాక్షిని ప్రశ్నించడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సాక్ష్యాధార చట్టం ప్రకారం నేర నిరూపణకు చెల్లవు. పరిస్థితుల ఆధారంగా నమోదైన ఈ కేసులో నేరాన్ని రుజువు చేయాలంటే బిర్దిచంద్‌ సర్దా వర్సెస్‌ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిన పంచసూత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కేసులో సాక్షులెవరూ ప్రాసిక్యూషన్‌కు అనుకూలంగా చెప్పలేదు. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా ఊహాజనిత అంశాలతో కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోలేవు. వైద్యుడు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా మాత్రమే శిక్ష విధించడం సరికాదు’ అంటూ హైకోర్టు ధర్మాసనం కింది కోర్టు తీర్పును రద్దు చేస్తూ అప్పీలును అనుమతించింది. పోచయ్యపై ఎలాంటి కేసులు లేనిపక్షంలో తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.

Tags

Next Story