HYDRA: హైడ్రా ఆదేశాలకు భయపడి మహిళ ఆత్మహత్య

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా ఆదేశాలకు భయపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఇటీవలే నోటీసులిచ్చారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్‌పల్లి ఇన్స్‌పెక్టర్‌తో మాట్లాడానని... మహిళ కూతుళ్లకు రాసిచ్చిన ఇళ్లు ఎఫ్‌టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని వెల్లడించారు.
హైడ్రాపై భయం పుట్టించొద్దన్న కమిషనర్
హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించే వార్తలు ప్రసారం చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. మూసీ ప్రాంతంలో భారీగా ఇళ్లు కూల్చేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్న వేళ ఆయన స్పందించారు. కొన్ని ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయన్నారు.
భారీ కూల్చివేతలకు సిద్ధమంటూ ప్రచారం
హైదరాబాద్‌లో నేడు భారీ కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం అయినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు 17 భారీ కూల్చివేత యంత్రాలను అధికారులు సిద్ధం చేశారని కూడా ప్రచారం జరిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతల ప్రక్రియను కొనసాగించనున్నట్లు వచ్చిన పుకార్లను రంగనాథ్ ఖండించారు. మూడు రోజులుగా మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. కూల్చివేత వార్తలతో స్థానికులు భయపడుతున్నారు.
ఇబ్రహీంపట్నంలో హైడ్రా అధికారుల పర్యటన
ఇబ్రహీంపట్నంలోని మున్సిపాలిటీ పరిధిలోని చెరువులను హైడ్రా అధికారుల బృందం శుక్రవారం పర్యటించింది. కబ్జాలకు గురైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, చెరువు పరిసరాలను, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను వారు పరిశీలించారు. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిసరాల్లో పాత, కొత్త నిర్మాణాలు పెద్దగా ఉండటంతో పాటు, నిర్మాణంలో ఉన్న కట్టడాల ఫొటోలను తీసుకున్నారు. చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన కట్టడాల గురించి ఆరా తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com