ACB: ఆ అధికారి అక్రమాస్తులు రూ. కోట్లలోనే

ACB: ఆ అధికారి అక్రమాస్తులు రూ. కోట్లలోనే
X
ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అరెస్ట్

ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు న‌మోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పుప్పాల శ్రీనివాస్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు జగిత్యాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. డీటీసీ శ్రీనివాస్ కు ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లుగా గుర్తించిన అధికారులు కేసు న‌మోదు చేశారు. ఈ సోదాల్లో హైదరాబాద్‌లోని విల్లాలతోపాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో దాదాపు రూ.5ల‌క్షల విలువ చేసే ఫారిన్ లిక్కర్‌ను కూడా గుర్తించిన‌ట్లుగా వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.

డీటీసీ అరెస్ట్

అక్రమ ఆస్తులు క‌లిగి ఉన్నట్లుగా ప్రాథ‌మిక నిర్ధార‌ణ త‌ర్వాత శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. సుమారు 10 గంటలపాటు ఆయనను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన తర్వాత హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. నేడు వ‌రంగ‌ల్ ఏసీబీ కోర్టులో శ్రీనివాస్‌ను రిమాండ్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌ను ఇంకా లోతుగా ప‌రిశీలిస్తున్నట్లు తెలిపారు. విచార‌ణ వివ‌రాల‌ను స్వయంగా ఏసీబీ డీజీపీ వెల్లడించ‌నున్నట్లు కూడా ప్రక‌ట‌న‌లో స్పష్టం చేశారు.

అన్ని కోట్లా ఆస్తి..

గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన డా.పుప్పాల శ్రీనివాస్ అంతకుముందు ఆదిలాబాద్, హైదరాబాద్‌లో పని చేశారు. ఈ క్రమంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం డీటీసీ అక్రమాస్తుల విలువ సుమారు రూ.4.5 కోట్ల వరకు ఉండగా.. బయట మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాటి విలువ రూ.15 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. 15 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమితో పాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. వాటితో పాటు 23 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story