TS: గొర్రెల పంపిణీ కేసు దర్యాప్తు వేగవంతం

TS: గొర్రెల పంపిణీ కేసు దర్యాప్తు వేగవంతం
లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ... కేసు కొట్టేసేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు...

తెలంగాణలో గొర్రెల పంపిణీ కేసును అవినీతి నిరోధకశాఖ లోతుగా విచారిస్తోంది. C.I.U. విభాగం ఇప్పటికే కేసు నమోదు చేయగా గుత్తేదారుతో కుమ్మక్కై పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారులు, సిబ్బంది నిధులు గోల్‌మాల్‌ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గొర్రెల పంపిణీ కేసులో ఇంకా ఎవరెవరున్నారు...? అక్రమార్కులు ఎంత మొత్తం స్వాహా చేశారనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు... గొర్రెల పంపిణీ పథకం కింద నిధుల మళ్లింపుపై పశుసంవర్ధక అధికారిపై నమోదైన కేసును కొట్టేయటానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలంగాణలో జరిగిన గొర్రెల పంపిణీలో అవినీతి నిరోధక శాఖ తీగ లాగుతోంది. ఇటీవలే ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేయగా ఉన్నతాధికారులు విచారణను C.I.U.కి అప్పగించారు. రంగంలోకి దిగిన విచారణ బృందం... అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించి.... విచారణ వేగవంతం చేసింది. మొత్తం 133 గొర్రెల యూనిట్లకు చెల్లించాల్సిన 2కోట్ల 20లక్షల రూపాయలు దారి మళ్లినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో దస్త్రాలు, హార్డ్‌డిస్క్‌లు మాయమైనట్టు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో 133 గొర్రెల యూనిట్లకు సంబంధించిన నిధులు మాత్రమే గోల్‌మాల్‌ అయ్యాయా...? గతంలోనూ ఏమైనా నిధులు స్వాహా చేశారా...? పశుసంవర్ధక శాఖకు చెందిన ఎంత మంది అధికారులు, సిబ్బంది ఈ వ్యవహారం నడిపించారు....? ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా...? అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు.


కేసు విచారణలో భాగంగా.... ఒకట్రెండు రోజుల్లో అవినీతి నిరోధకశాఖ అధికారులు తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుత్తేదారు, పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవహారంలో మరిన్ని నిధులు గోల్‌మాల్‌ జరిగినట్టు అనిశా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణలో ACB కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

గొర్రెల పంపిణీ పథకం కింద నిధుల మళ్లింపుపై మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక అధికారి M.ఆదిత్య కేశవసాయిపై కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. రైతులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల నిధుల మళ్లింపుపై ఈనెల 26న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేయగా... తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ పశుసంవర్ధకశాఖ అధికారి ఆదిత్య కేశవ సాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గొర్రెల పంపిణీకి చెందిన లావాదేవీలన్నీ గత ఏడాది ఆగస్టులో జరగ్గా.... ఎన్నికలు పూర్తయ్యాక డిసెంబరులో కేసు నమోదు చేశారంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. గొర్రెలకు ట్యాగింగ్, ఫొటోలు తీయడం, ఇతర వివరాలను కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయాలని, దాని ఆధారంగా నిధులను బదిలీ చేయాల్సి ఉందనీ... ఏసీపీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గొర్రెలను సరఫరా చేసిన రైతులకు నిధులు అందలేదని, అవి ఇతరుల ఖాతాల్లోకి మళ్లింపు జరిగిందని... అధికారుల సాయం లేకుండా ఈ కుంభకోణం జరగదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి... ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story