TG: ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణాశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు. నేటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.
"సమగ్ర విచారణకు ఆదేశించాం"
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన తనను తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలపై రవాణాశాఖకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో ఫోన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నామన్నారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్ల సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల పరిహారం
కర్నూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు అందించనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అయితే, తెలంగాణ వాసులకే ఈ పరిహారం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే బస్సులో మృతదేహాల వెలికితీత ప్రక్రియ పూర్తయ్యింది. ప్రమాదంలో మెుత్తం 19 మంది మృతి చెందగా.. 23 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
మాటలు రావటం లేదు: మోహన్‌బాబు
హైదరాబాద్-బెంగళూరు హైవేపై జరిగిన బస్సు దుర్ఘటనపై నటుడు మోహన్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ' ప్రమాద తీవ్రత చూసి మాటలు రావటం లేదు. క్షణాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయి, సజీవదహనం కావటం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని, దుఃఖంలో ఉన్న వారందరికీ దేవుడు బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

