TS: బ్యారేజీలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు

TS: బ్యారేజీలకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు
X
మూడు బ్యారేజీలపై పూర్తిస్థాయి విచారణ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వం... నేడు పరిశీలించనున్న సేఫ్టీ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ మూడు బ్యారేజీలను పూర్తి స్థాయిలో విచారణ చేయాలని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు NDSA బృందం త్వరలోనే తెలంగాణలో పర్యటించనుంది. ఇవాళ రాష్ట్రస్థాయి సేఫ్టీ బృందం ఆ మూడు ప్రాజెక్టులను పరిశీలించనుంది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ- NDSA అధికారుల బృందం ఈవారంలోనే తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.


రాష్ట్రస్థాయి డ్యాం సేఫ్టీ బృందం ఇవాళ బ్యారేజీలను పరిశీలించనున్నట్లు సమాచారం. అందులో సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌కి చెందిన శాస్త్రవేత్తలతోపాటు మరికొందరు ఉన్నట్లు తెలిసింది. గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతోపాటు పియర్స్‌కి బీటలువారగా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సీపేజీ సమస్య ఎదుర్కొంటున్నాయి. అన్నారం బ్యారేజీలో నీటినిఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీ గుర్తించగా... సుందిళ్ల బ్యారేజీలోనూ గుర్తించి కెమికల్‌ గ్రౌటింగ్‌ చేశారు. శాశ్వత చర్యలు చేపట్టేందుకు డిజైన్‌లో లోపం ఉందా? డిజైన్‌ ప్రకారమే నిర్మాణం జరిగిందా.. లేదా? నాణ్యత లోపించిందా? ఇసుక ఎక్కువగా మేటవేస్తున్నందున ప్రవాహంలో మార్పువచ్చి సమస్య ఏర్పడిందా అనే అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇందుకోసం త్వరలోనే నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


మేడిగడ్డతో పాటు సీపేజీ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలను పరిశీలించి బ్యారేజీల భద్రతపై నివేదిక ఇవ్వాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా ఈ నెల 13న NDSA ఛైర్మన్‌, కేంద్ర జల సంఘం ఛైర్మన్‌కు లేఖ రాశారు. మూడు డ్యాంల భద్రతపై NDSA ధ్రువీకరించాకే తదుపరి చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ఆ కమిటీ అభిప్రాయాలు, సిఫార్సులు కీలకం కానున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలో రెండు బ్లాక్‌ల పరిధిలో.... విచారణ ఇప్పటికే పూర్తి కాగా... మరో బ్లాక్‌లో చేయిస్తున్నట్లు తెలిసింది.

బ్యారేజీలో నీటిని పూర్తిగా ఖాళీచేసిన తర్వాత కొత్తగా 49వ వెంట్‌ వద్ద సీపేజీని గుర్తించారు. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే గర్తించారు. లేకుంటే క్రమంగా ఇది పెద్దదయ్యేవరకు నీటిలో కనిపించేది కాదని అధికార వర్గాలు తెలిపాయి. సుందిళ్లలోనూ లీకేజీలను అరికట్టేందుకు కెమికల్‌ గ్రౌటింగ్‌ చేశారు. అక్కడా పూర్తిగా నీటిని తొలగించిన తర్వాత ఇంకెక్కడైనా సీపేజీ ఉందా లేదా అన్నది తెలియదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Tags

Next Story