TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్‌

TPCC: తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్‌
ఇప్పటికే చేరిన కుంభం అనిల్‌... 27న చేరనున్న మైనంపల్లి... మరికొంతమంది నేతల చూపు హస్తం వైపు...

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల జోష్‌ మొదలైంది. హస్తం పార్టీలోకి వచ్చేవారికి కొంత విరామం ఇచ్చిన తెలంగాణ నాయకత్వం... అధిష్టానం స్పష్టమైన ఆదేశాలతో ముఖ్యమైన నాయకులను తిరిగి చేర్చుకునే ప్రక్రియను ముమ్మరం చేసింది. భువనగిరి మాజీ DCC అధ్యక్షుడు కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన అనూహ్యంగా మళ్లీ హస్తం గూటికి చేరారు. కుంభం అనిల్‌ నివాసానికి వెళ్లిన TPCC అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఆ తరువాత అనిల్‌ కుమార్‌కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి తిరిగి ఆహ్వానించారు. AICC ఆదేశాల మేరకు అనిల్‌ను పార్టీలో చేర్చుకున్నట్లు స్పష్టం చేసిన రేవంత్‌ రెడ్డి, TPCC ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతి కార్యక్రమాన్నిఅనిల్‌ విజయవంతం చేశారని కొనియాడారు.


రెండు సీట్లు ఇస్తామనే హామీ మేరకు మల్కాజిగిరి MLA మైనంపల్లి హనుమంత రావు ఈ నెల 27న కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తనతో పాటు కుమారుడు రోహిత్‌ కలిపి మల్కాజిగిరి, మెదక్‌ టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఆయన చేరికకు తెలంగాణ కాంగ్రెస్ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మైనంపల్లికి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాదరణపై కాంగ్రెస్‌ అధిష్టానం సర్వేలు చేసింది. అందుకు అనుగుణంగా పార్టీలో చేర్చుకోవాలని AICC స్థాయిలో పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరేవారికి ఐదేళ్ల వరకు ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వరాదని ఉదయపూర్‌ డిక్లరేషన్‌ ఉంది. ఈ తీర్మానాన్ని పక్కనపెట్టి మెదక్‌తోపాటు మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు మైనంపల్లి ప్రకటించారు.


ఢిలోమూడు రోజులపాటు జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశంలో నియోజకవర్గాల వారీగా చర్చల్లో ఎక్కడ బలమైన నాయకులున్నారు? ఎక్కడ లేరు? అనే విషయాల్ని గుర్తించినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతలు బలంగా ఉన్న స్థానాల్లో బీఆర్‌ఎస్‌, భాజపాల తీసుకోరాదని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పలువురు నాయకులు వచ్చేందుకు చొరవ చూపినా... సున్నితంగా తిరస్కరించారు. స్క్రీనింగ్‌ కమిటీలో చర్చించిన తరువాత దాదాపు 15 నియోజకవర్గాలల్లో బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొనే నేతలు లేరని గుర్తించారు. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకుల్ని చేర్చుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ నాయకుడు కూడా చొరవచూపుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story