Modi Tour: రేపు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన.. అడ్డుకుంటామంటున్న వామపక్షాలు..

Modi Tour: రేపు రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన.. అడ్డుకుంటామంటున్న వామపక్షాలు..
Modi Tour: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోదీ రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Modi Tour: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ప్రధాని మోదీ రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన సభలో మోదీ పాల్గొంటారు. 20 నిమిషాల పాటు బేగంపేట సభలో ఉండనున్నారు. అనంతరం రామగుండం పర్యటనకు వెళ్తారు. సభలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌, వామపక్షాలతో పాటు పలు సంఘాలు హెచ్చరించాయి. టీఆర్‌ఎస్‌, వామపక్షాలు ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశాయి. ప్రధాని మోదీకి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని సీపీఐ విమర్శించింది. గతేడాది ప్రారంభమైన ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.


అటు.. రామగుండంలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ గళమెత్తారు. సింగరేణికి సంబంధించిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడంపై మండిపడుతున్నాయి. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై టీఆర్‌ఎస్‌ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నీతి ఆయోగ్‌ చెప్పిన నిధులు ఇచ్చేది ఎప్పుడు అంటూ నేతలు కేంద్రాన్ని నిలదీస్తున్నారు. తెలంగాణకు ఉత్త చేతులతోనే మోదీ వస్తారా? లేక ఏమైనా తెస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు తెలంగాణ యూనివర్సిటీస్‌ జేఏసీ సైతం.. నిరసనలు చేయాలని తీర్మానించింది. రేపు అన్ని విశ్వవిద్యాలయాల్లో నల్లజెండాలతో ఆందోళన చేస్తామన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 8 డిమాండ్లతో బహిరంగ లేఖ రాశారు తెలంగాణ మేధావులు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతామని గిరిజన సంఘాల జేఏసీ ప్రకటించింది. కేంద్రం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. గిరిజన వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తెలంగాణకు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో.. మరోసారి మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి.


మోదీ పర్యటనను టీఆర్‌ఎస్‌ కావాలనే రాజకీయం చేస్తుందని బీజేపీ మండిపడింది. కేంద్రం చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అటు.. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్ వేసింది ప్రభుత్వం.


రేపు మధ్యాహ్నం 12.25కు విశాఖ నుంచి హైదరాబాద్‌ బయల్దేరుతారు ప్రధాని మోదీ. ఒకటిన్నరకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 నుంచి 2 గంటల వరకు ఎయిర్‌పోర్ట్‌లో పబ్లిక్‌ మీటింగ్‌కు హాజరవుతారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 2.15కు బేగంపేట నుంచి రామగుండం బయల్దేరతారు. 3.20కు రామగుండం హెలీప్యాడ్‌కు చేరుకుని.. రోడ్డు మార్గం ద్వారా ఫ్యాక్టరీ వద్దకు వెళతారు. సాయంత్రం 4.15కు కార్యక్రమం జరిగే ప్రాంతానికి రానున్నారు. 5.15 వరకు జాతికి అంకితం ఇచ్చే పలు ప్రాజెక్టుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐదున్నరకు రామగుండం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరతారు. 6.40కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరతారు.

Tags

Read MoreRead Less
Next Story