TS CONGRESS: ప్రజల్లోకి కాంగ్రెస్‌

TS CONGRESS: ప్రజల్లోకి కాంగ్రెస్‌
తిరగబడదాం-తరిమికొడదాం పేరుతో బస్సు యాత్ర.... ఎన్నికల కసరత్తు వేగవంతం

తెలంగాణలో ఎన్నికల నగార మోగడంతో కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ప్రచారంపైనా ప్రత్యేక దృష్టి సారించింది. మరో వారంలోపే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వందకుపైగా స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే దాదాపు 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పలు నియోజకవర్గాలలో నిర్వహించిన సర్వేల్లో అగ్రస్థానంలో నిలిచిన నాయకుల పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్న వివాద రహిత నియోజకవర్గాలు దాదాపు 63 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వామపక్షాలతో పొత్తు తేలకపోవడం, మరికొందరు పార్టీలో చేరేవారుండడంతో తుదినిర్ణయం మరికొంత ఆలస్యమవుతుందని కాంగ్రెస్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.

"తిరగబడదాం- తరిమికొడదాం" అనే నినాదంతో బస్సుయాత్ర ద్వారా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇవాళ సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో.. బస్సు యాత్రతోపాటు పార్టీ అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలపై చర్చించనున్నారు. షెడ్యూల్‌ విడుదల కావడంతో... అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైతే నష్టపోయే ప్రమాదం ఉందని ఆశావహుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేసి వివాదాల్లేని స్థానాల్లోనైనా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ జరిగే రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో విధివిధానాలపై చర్చించనున్నారు. యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఎక్కడెక్కడ కార్నర్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. మూడు డిక్లరేషన్లు, చేయూత పింఛన్‌, ఆరు గ్యారంటీలను విస్తృత ప్రచారం కల్పించాలని భావిస్తోంది. బీసీ డిక్లరేషన్‌, మహిళ డిక్లరేషన్‌ కూడా త్వరగా ప్రకటించి... వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. ఈ నెల 15వ తేదీన బస్సుయాత్రను ప్రియాంక గాంధీ ప్రారంభించి ఆమె రెండు రోజులపాటు బస్సుయాత్రలో పాల్గొంటారు. ఆ తరువాత ఈ నెల 18, 19 తేదీలల్లో రాహుల్‌ గాంధీ, 20, 21 తేదీలల్లో AICC అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బస్సు యాత్రలో పాల్గొంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. బస్సు యాత్ర వారం, పది రోజులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో...ఎన్ని రోజులు అనేదానిపై స్పష్టత రానుంది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై శ్రీధర్‌ బాబు కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఆ కమిటి ఇప్పటికే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంది. సబ్బండ వర్గాలను ఆకట్టుకునేలా హామీలు పొందుపరిచాలని భావిస్తోంది. బస్సుయాత్రలో రాహుల్‌గాంధీ చేతుల మీదుగా ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. 18, 19 తేదీల్లో రాహుల్‌ గాంధీ బస్సుయాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంలో మేనిఫెస్టోను ఆయన చేతుల మీదుగా విడుదల చేయించాలని TPCC భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story