TS: మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ ఢిల్లీ వేదికగా వ్యూహ మథనం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశానికి భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నంసహా ఇతర నేతలు హాజరయ్యారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా ఏఐసీసీ... తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పాగా వేసిన తరహాలోనే పార్లమెంటరీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని సమాలోచలు చేశారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి పక్కా ప్రణాళికలు రూపొందించుకొని అత్యధిక మంది ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రాబోయే ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా 539 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. వీరికి మార్గనిర్దేశం చేసేందుకు రాష్ట్రాలను అయిదు క్లస్టర్లుగా విభజించి.. రెండు రోజులపాటు దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలి రోజైన గురువారం క్లస్టర్-1 కింద తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, క్లస్టర్-2 కింద ఆంధ్రప్రదేశ్, గోవా, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల సమన్వయకర్తలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమావేశమయ్యారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఢిల్లీలో AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంటు స్థానాల సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంత్రులు భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క సహా ఇతర నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. ఖర్గే, రాహుల్ దిశానిర్దేశం చేశారని సమావేశం తర్వాత... భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో పోటీ చేయాలని సోనియాగాంధీని సమావేశంలో కోరామని వివరించారు. తెలంగాణలో 13 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని మంత్రులు ఉత్తమ్, పొన్నంప్రభాకర్ ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అమాత్యులు పేర్కొన్నారు. దేశానికి కాంగ్రెస్ నాయకత్వం అవసరమని మంత్రులు సీతక్క, కొండా సురేఖ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలోపు ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామన్న అమాత్యులు.. మెరుగైన ఫలితాలు సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్తలుగా వ్యవహరించే నాయకులు గెలుపు బాధ్యతలు తీసుకోవాలని ఏఐసీసీ పెద్దలు దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com