TPCC: నేటి నుంచే రంగంలోకి మీనాక్షి నటరాజన్

కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ నేటి నుంచి క్షేత్రస్థాయిలో కార్యాచరణలోకి దిగుతున్నారు. పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. తొలుత గాంధీభవన్‌లో మెదక్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ భేటీలో మీనాక్షి పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతానికి ఏ చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. మంగళవారం మెదక్, మల్కాజిగిరి; బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్యనేతలందరూ రావాలని పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమితులైన తరవాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు.
కాంగ్రెస్ లో పదవుల భర్తీ..!
ఇటీవల ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలిపినందున ఆ మేరకు ఇకముందు కాంగ్రెస్‌లో పదవుల భర్తీ కూడా ఉంటుందని నేతలు చెబుతున్నారు. ప్రధానంగా మాల, మాదిగ వర్గాల నేతలకు ఎమ్మెల్సీ టికెట్లు, నామినేటెడ్, మంత్రి పదవుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ ప్రకారం ప్రాధాన్యమిస్తారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల 20లోగా పూర్తవుతుందని పార్టీ వర్గాల అంచనా. నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాలవారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇన్‌ఛార్జి మంత్రులకు పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com