Dasoju Sravan: కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ రాజీనామా..

Dasoju Sravan: కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ రాజీనామా..
Dasoju Sravan: టీ.కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసంతృప్తితో నేతలు పార్టీని వీడుతున్నారు.

Dasoju Sravan: టీ.కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసంతృప్తితో నేతలు పార్టీని వీడుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీకి, పదవులకు రాజీనామా చేయడంతో ఆ పార్టీ సంక్షోభం దిశగా వెళ్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికీ రిజైన్‌ చేశారు.

ఇప్పుడు కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ రాజీనామా చేయడంతో హస్తం పార్టీకి మరో బలం తగ్గినట్లయ్యింది. అయితే దాసోజు శ్రవణ్‌ను కాంగ్రెస్‌ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు. శ్రవణ్‌ ఇంటికి వెళ్లిన అనిల్‌, మహేష్‌ గౌడ్‌, కోదండ రెడ్డి బుజ్జగించాలని ప్రయత్నించినా.. ఆయన వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పేశారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు దాసోజ్‌ శ్రవణ్‌. ఆయన వల్లే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ను రేవంత్‌ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ తప్పుల్ని సరిదిద్దాల్సిన మాణిక్కం ఠాగూర్‌... ఆయనతో కలిసి కుమ్మక్కయ్యారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను రాబరీ పార్టీగా మార్చేశారని దుయ్యబట్టారు.

తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా రేవంత్‌ రెడ్డి కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్‌ అయ్యాక.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌ బాగుపడదని ఎద్దేవా చేశారు. ఇక కార్యకర్తలకు పేరుపేరునా కృతజ్ఞతలు చెబుతూ.. పార్టీకి, తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

గత ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసిన దాసోజు శ్రవణ్‌.. ఓటమి పాలయ్యారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో విజయా రెడ్డి చేరికపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఈ వరుస పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ సంక్షోభంలో పడినట్లయ్యింది. మరింకొందరు పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story