అఖిల ప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా

బోయిన పల్లి కిడ్నాప్ కేసులో ఏ-1 నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్, కస్టడీ పిటిషన్‌ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరుపు న్యాయవాదులు కోర్టుకు అప్పీల్ చేశారు.
అఖిలప్రియ ఆరోగ్యంపై కోర్టులో న్యాయవాది మెమో దాఖలు చేశారు. జైల్లో కింద పడిపోయారని.. ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని తెలిపారు. చికిత్స కోసం ఈఎన్‌టీ సర్జన్ వద్దకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అఖిలప్రియ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేయాలని.. జైలు అధికారులను ఆదేశించాలని మెమోలో పేర్కొన్నారు.
అటు.. అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే విచారణ నుంచి తప్పించుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. బెయిల్‌పై విడుదలైతే మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని, అఖిల ప్రియ చర్యలతో స్థానికుల్లో అభద్రతాభావం నెలకొందని వివరించారు.
సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సాక్షుల వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com