ALIND Land: హైదరాబాద్‌లో ఆలిండ్‌ ఫ్యాక్టరీ స్థలం కబ్జా.. రాత్రికి రాత్రే 15 ఎకరాలు..

ALIND Land: హైదరాబాద్‌లో ఆలిండ్‌ ఫ్యాక్టరీ స్థలం కబ్జా.. రాత్రికి రాత్రే 15 ఎకరాలు..
ALIND Land: అది హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఆలిండ్‌ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ భూముల విలువ కోట్ల రూపాయలు.

ALIND Land: అది హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న ఆలిండ్‌ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ భూముల విలువ కోట్ల రూపాయలు. దీంతో ఈ భూములపై పడింది రియల్టర్ల కన్ను. ఓ రాజ్యసభ సభ్యుడి అండతో రాత్రికి రాత్రే కబ్జాకు దిగింది KNR కన్‌స్ట్రక్షన్‌ అనే సంస్థ. అర్ధరాత్రి పొక్లెయిన్లు, జేసీబీల, లారీలతో చొరబడ్డారు. ప్రహరీ కూల్చి, కంచె వేసి భూమి స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా బేఖారు చేశారు. రెవెన్యూ, పోలీస్‌ అండతో.. దర్జాగా ఆక్రమించేశారు. ఈ కబ్జా వ్యవహారమంతా.. ఓ రాజ్యసభసభ్యుడి కనుసన్నల్లో జరగడం.. వివాదస్పదంగా మారింది.

ఆలిండ్ సంస్థ.. 1961లో CIFL ద్వారా 45 ఎకరాలు, ప్రభుత్వం ద్వారా 1967లో 53.14 ఎకరాలు భూమిని కొనుగోలు చేసింది. సర్వేనెంబర్లు 90, 91, 92,93, 94, 95,.96,99 100, 101లో...మొత్తం 98. 14 ఎకరాల భూమి ఉంది. మొత్తం 98 ఎకరాలకు పక్కాగా యాజమాన్య పత్రాలు ఉన్నాయి. 60 ఏళ్ల క్రితం తీసుకున్నప్పటినుంచి ఆలిండ్‌ సంస్థకు ఎలాంటి ఆటంకాలు లేవు. అయితే గత ఏడాది అక్టోబర్‌లో సడన్‌గా వివాదం మొదలైంది. 98.14 ఎకరాల్లో పది ఎకరాలు తమకు భూమి ఉందంటూ KNR కన్‌స్ట్రక్షన్‌కు చెందిన జలంధర్‌రెడ్డి సడన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

రెవెన్యూ అధికారులను మేనేజ్‌ చేసి సడెన్‌గా సర్వే కూడా నిర్వహించేందుకు ఆలిండ్‌ కంపెనీకి వెళ్లగా కంపెనీ యజమాన్యం షాకైంది. తమ ప్రమేయం లేకుండా తమ భూమిని కొలవడం ఏంటంటూ అధికారులను ప్రశ్నించింది. దీనికి సంబందించి డాక్యుమెంట్లను సైతం సమర్పించింది. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడగట్టుకొని ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏకపక్ష సర్వేలు నిర్వహించి వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. ఓ రాజ్యసభ సభ్యుడి అండతోనే ఈ కబ్జాకు తెగబడినట్లు తెలుస్తోంది. 13 నవంబర్‌ 2021న గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 60 ఏళ్లుగా ఉన్న కాంపౌండ్‌ వాల్‌ను కూల్చేసి కబ్జాకు యత్నించారు.

కంపెనీ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రభుత్వ సహకారంతో తిరిగి కూల్చి గోడను కట్టేసుకున్నారు. ఇలా అయితే వర్కవుట్‌ కాదనుకున్న KNR కన్‌స్ట్రక్షన్‌ సంస్థ.. ఈ నెల 13 అర్థరాత్రి మంది మార్బలంతో.. పొక్లైయిన్లు, జేసీబీలు, లారీలతో ఒక్కసారిగా.. ఆలిండ్‌ భూములపైకి దాడికి దిగారు. మరోసారి కాంపౌండ్‌ వాల్‌ను కూల్చి దాదాపు పది ఎకరాల భూమిని తమ కబ్జాలోకి తీసుకున్నారు. ఓ రాజ్యసభ సభ్యుడి అండదండలతోనే.. KNR కన్‌స్ట్రక్షన్‌ సంస్థ యాజమాన్యం రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. కబ్జాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేసి రాత్రికి రాత్రే కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేశారు.

KNR కన్‌స్ట్ర క్షన్‌ సంస్థ ఆక్రమించిన భూమిలో ఆలిండ్‌కు సంబంధించిన గెస్ట్‌ హౌస్‌, కార్మికుల క్వార్టర్స్‌ ఉన్నాయి. కార్మికులు, యాజమాన్యం ఎంత మొర పెట్టుకున్నా.. పోలీసులు కానీ, అధికారులు కానీ అటు వైపు చూసిన పాపాన పోలేదు. కబ్జా పూర్తై ఇదంతా తమ భూమని KNR కన్‌స్ట్రక్షన్‌ చెప్పుకునేందుకు అన్ని రెడీ చేసుకున్నాక.. పోలీసులు రంగప్రవేశం చేసి.. కార్మికులనే అదరగొట్టారు. అంతే కాకుండా కార్మికుల క్వార్టర్లకు, కంపెనీలకు మధ్య ఫెన్సింగ్‌ వేసి.. కంపెనీలోకి కార్మికులు రాకుండా.. అడ్డుకుంటున్నారు.

క్వార్టర్లకు నీళ్లు, కరెంట్‌ కట్‌ చేసి.. డ్రైనేజీ వ్యవస్థను ధ్వంసం చేసి కార్మికులను ఎలాగైనా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నివేదిక కోర్టు పరిశీలనలో ఉండగానే ప్రహరీ కూల్చివేయడాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రశ్నిస్తోంది. దౌర్జన్యంగా ఫెన్సింగ్‌ ఎందుకు వేస్తున్నారని అడిగితే చేయి చేసుకున్నారని సెక్యురిటీ గార్డులు చెబుతున్నారు. మూడు క్వార్టర్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపేశారు. ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని క్వార్టర్లలో ఉంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story