కొల్లూరు టౌన్‌షిప్ ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం

నేటితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనుండటంతో సీఎం కేసీఆర్ షెడ్యూల్ బిజీగా కన్పిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేడు చాలా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు కేసీఆర్. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్‌లను ప్రారంభించనున్నారు. అనంతరం పటాన్‌చెరులో 200 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కొండకల్లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. దీంతో పాటు సాయంత్రం హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మించిన తెలంగాణ అమర వీరుల అఖండ జ్యోతిని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.
ఇక సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్‌షిప్ ప్రారంబోత్సవానికి సర్వం సిద్ధం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్‌లను ఇవాళ ఉదయం 10గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 14వందల 32.50 కోట్ల వ్యయంతో ఒకే చోట 15వేల 660 ఇండ్లను నిర్మించారు. సుమారు లక్ష జనాభా ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా ఈ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎస్+9లో 38 బ్లాక్‌లు, ఎస్+10లో 24 బ్లాక్‌లు, ఎస్+11లో 55 బ్లాక్‌లు.. మొత్తం 117 బ్లాక్‌లుగా నిర్మించారు. ఒక్కో డబుల్ బెడ్‌రూం విస్తీర్ణం 580 ఎస్‌ఎఫ్‌టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్‌లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30 మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు.
12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్‌ని ఏర్పాటు చేశారు. మురికినీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పనులు వంద శాతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యింది. అద్భుతంగా నిర్మించిన కొల్లూరు డబుల్ బెడ్ రూం కాలనీని ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేయనున్నారు సీఎం కేసీఆర్.
కొల్లూరు డబుల్ ఇండ్ల సమూదాయంలో బస్టాండ్, పోలీస్ ఔట్‌పోస్టు, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగ్, ప్రభుత్వ దవాఖాన, పీహెచ్‌సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, హైస్కూల్, అంగన్‌వాడీ భవనాలు, ప్రతి సెక్టార్‌లో పాలకేంద్రాలు, ఫంక్షన్‌హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్, బ్యాంక్, ఏటీఎంలు, పోస్టాఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లతో పాటు సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తున్న అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇక మోడ్రన్ సిటీని తలపించేలా ఉన్న కొల్లూరు టౌన్ షిప్‌కు కేసీఆర్ నగర్‌గా నామకరణం చేశారు. ఇక ఆసియాలో అతిపెద్దదైన డబుల్ బెడ్‌రూం గృహ సముదంగా ఇది నిలవనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com