నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి..!

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి..!
హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

హోరాహోరీగా సాగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఎన్నికల సామాగ్రితో పాటు అధికారులు, సిబ్బంది నియోజకవర్గానికి చేరుకున్నారు. సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 20 వేల 300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరిలో ఒక లక్షా 9 వేల 228 మంది పురుషులు ఉండగా.. మహిళా ఓటర్లు ఒక లక్షా 11 వేల 72 మంది ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్.. ఎన్నికల నిర్వహణకు 5 వేల 535 మంది సిబ్బందిని నియమించారు.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. పోలింగ్‌ కేంద్రంలో ఓటేయడానికి వచ్చి క్యూలైన్లలో నిల్చునే ఓటర్లకు ఎండ తగలకుండా టెంట్లు ఏర్పాటు చేయగా.. ఈవీఎంలపై గుర్తును నొక్కడానికి ప్రత్యేకమైన గ్లవ్స్‌‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో శానిటైజర్లతో పాటు ఇద్దరు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ఇక.. మొత్తం 41 మంది అభ్యర్థులు సాగర్ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 346 పోలింగ్ కేంద్రాల్లో 108 సమస్యాత్మకంగా కేంద్రాలుగా పోలీస్ అధికారులు గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం మూడు వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు. దీంతో పాటు మూడు కంపెనీల కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తున్నామని అధికార యంత్రాంగం తెలిపింది. హింస చెలరేగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది పోలీసు సిబ్బందిని భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.

Tags

Read MoreRead Less
Next Story