ముగియనున్న గణేష్ ఉత్సవాలు.. అందరి దృష్టి బాలాపూర్ లడ్డూ వేలంపైనే..

ముగియనున్న గణేష్ ఉత్సవాలు.. అందరి దృష్టి బాలాపూర్ లడ్డూ వేలంపైనే..
X
వినాయక చతుర్థి ఉత్సవాలు గురువారం ముగియనుండగా, అందరి దృష్టి ప్రసిద్ధ 21 కిలోల బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదం వేలంపై ఉంది.

వినాయక చతుర్థి ఉత్సవాలు గురువారం ముగియనుండగా, అందరి దృష్టి ప్రసిద్ధ 21 కిలోల బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదం వేలంపై ఉంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట మొదలైంది. వేలం పాటలో 25 మంది పాల్గొనేందుకు అర్హులు కాగా, స్థానికేతరులతో సహా ఐదుగురు కొత్త వ్యక్తులు మంగళవారం వరకు వేలంపాటలో పాల్గొనేందుకు తమ పేరు నమోదు చేసుకున్నారు.

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం బాలాపూర్‌లో గణేష్ విగ్రహాన్ని ఊరేగించే ముందు నిర్వహించే లడ్డూ వేలంలో మరికొంత మంది పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది లడ్డూను స్థానిక రైతు వంగేటి లక్ష్మా రెడ్డి రూ.24.60 లక్షలకు కొనుగోలు చేయడంతో గతేడాది కంటే రూ.5.70 లక్షలు అధికంగా పలికింది. ఈసారి లడ్డూ సరికొత్త రికార్డు ధరను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సంవత్సరం, బాలాపూర్ గణేష్ విగ్రహం పంచముఖి నాగేంద్రపై (ఐదు తలలు) కదులుతున్న కళ్ళు మరియు చెవులతో కూర్చున్న భంగిమలో రూపొందించబడింది మరియు పండల్‌ను విజయవాడ కనకదుర్గ ఆలయ థీమ్‌తో అలంకరించారు.

గణేష్ లడ్డూ వేలం 1994లో మొదలైంది. అప్పుడు స్థానిక రైతు కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలకు లడ్డూని వేలంలో దక్కించుకున్నారు. మోహన్ రెడ్డి తన కుటుంబానికి మరియు స్థానికులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేసిన తర్వాత, తన పొలంలో చల్లడంతో దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇక్కడ లడ్డూ ఆరోగ్యం, సంపద మరియు శ్రేయస్సును కలిగిస్తుందనే విశ్వాసం అప్పటి నుంచి మొదలైంది.

Tags

Next Story