SC: ఎమ్మెల్యేల ఫిరాయింపు... కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని వారు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా? లేదా పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాళ్టి విచారణలో తేలనుంది. స్పీకర్ నిర్ణయాన్నే సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలేయాదయ్యకు సైతం క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తికాగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కు ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్క రోజు ముందు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది
తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కొంతకాలంగా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారారని, లేదా పార్టీ మారే ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదులు అందాయి. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై వేర్వేరు సందర్భాల్లో ఫిర్యాదులు దాఖలవ్వగా, వాటిపై స్పీకర్ విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

