Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు.. ఇదే పాలిటిక్స్‌‌లో హాట్ టాపిక్..

Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు.. ఇదే పాలిటిక్స్‌‌లో హాట్ టాపిక్..
Munugodu: తెలంగాణలో మునుగోడు కాక రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రాజకీయం వేడెక్కింది.

Munugodu: తెలంగాణలో మునుగోడు కాక రేపుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. పోటాపోటీగా విమర్శలు, ప్రతివిమర్శలకు దిగాయి. రాజీనామా చేసిన రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్‌ను టార్గెట్‌ చేశారు. కాంట్రాక్టుల కోసం తాను బీజేపీలోకి వెళుతున్నాంటూ ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి .. దీన్ని నిరూపించాలంటూ సవాల్‌ చేశారు. నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసానికి సిద్ధమని.. నిరూపించలేకపోతే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా అంటూ రేవంత్‌కు సవాల్‌ విసిరారు. డబ్బులు తీసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేసే చరిత్ర అంటూ రేవంత్‌పై మండిపడ్డారు.

అటు.. మునుగోడు ఉపఎన్నికలో గెలుపు తమదేనన్నారు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమతో టచ్‌లో ఉన్నారన్నారు. యాదాద్రి జిల్లా బస్వాపూర్‌ నుంచి రెండోరోజు పాదయాత్ర ప్రారంభించిన ఆయన.. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు. ఈనెల 7న మునుగోడులో పాదయాత్ర, బహిరంగసభ ఉంటుందన్నారు. బహిరంగసభకు తరుణ్‌చుగ్ వచ్చే అవకాశం ఉందని, అదే సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి రాజగోపాల్‌రెడ్డి ప్రసంగించే అవకాశం ఉందని తెలిపారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అవుతాయన్నారు బండి సంజయ్.

రాజగోపాల్ రెడ్ది బీజేపీలో చేరగానే రాష్ట్ర నాయకత్వమంతా మునుగోడులో మోహరిస్తామన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హుజూరాబాద్‌లో ఆడిన నాటకాలు ఇక్కడ సాగనివ్వమని హెచ్చరించారు. రాజగోపాల్ రాజీనామా చేస్తానంటే మునుగోడు ప్రజలు సంబరపడుతున్నారని.. ఉపఎన్నిక వస్తే సమస్యలు తీరుతాయని భావిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మండిపడ్డారు ఈటల రాజేందర్‌. మునుగోడు సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్‌కు చావో రేవోగా మారింది. దీంతో రాజగోపాల్‌రెడ్డితో టచ్‌లో ఉన్న వారిపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

పార్టీ క్యాడర్‌ చేజారిపోకుండా చర్యలు చేపట్టిన కాంగ్రెస్.. రాజగోపాల్‌రెడ్డి అనుచరవర్గం నేతలను సస్పెండ్ చేసింది. మునుగోడు పరిధిలోని ఆరు మండలాల అధ్యక్షులపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో పాటు ఈనెల 5న మునుగోడులో జరిగే విస్తృతస్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లు చేస్తోంది. మునుగోడు అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థి కోసం వెతికే పనిలో పడింది. మునుగోడు రేసులో ఈసారి పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్ నేత, పల్లె రవిలు పోటీపడుతున్నారు. వీరిని కాదని.. అనూహ్యంగా కొత్తగా చెలమల కృష్ణారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

చెలమల కృష్ణారెడ్డి పేరును కాంగ్రస్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా దాదాపు చెలమల కృష్ణారెడ్డి పేరు ఖరారు అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రేవంత్‌ రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండించారు ఎమ్మెల్యే సీతక్క. టీఆర్‌ఎస్‌పై రాజగోపాల్‌రెడ్డి పోరాటం పూర్తిగా అపద్దమన్నారు. ఆయన రాజీనామాతో మునుగోడు ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. తెలంగాణకు చేసిందేమి లేదన్నారు.

మరోవైపు.. ఈ పరిణామాల్ని మందుగానే ఊహించిన TRS.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గట్టుప్పల్‌ మండల ఏర్పాటు కూడా ఇందులో భాగమేనంటున్నారు. అటు, ఆపరేషన్‌ ఆకర్ష్‌తో గ్రామ, మండల స్థాయిలో టీఆర్‌ఎస్‌లోకి చేరికలు పెరిగాయి. మునుగోడు టికెట్‌ కోసం ప్రధానంగా ఐదుగురు పోటీ పడుతున్నారు. ఉన్నట్టుండి తెరపైకి మండలి ఛైర్మన్‌ గుత్తా పేరు వచ్చింది. మొత్తానికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో.. తెలంగాణ రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.

Tags

Read MoreRead Less
Next Story