NAGOBA: నాగోబా మహా జాతర ప్రారంభం

ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా దేవాలయంలో నాగోబా మహా జాతర ప్రారంభమైంది. నాగోబా దేవాలయంలోని నాగోబా దేవతకు మెస్రం వంశీయులు, అధికారులు ప్రత్యేక పూజలు చేసి జాతరను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జు, అనిల్ యాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, మెస్రం వంశీయులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 4 వరకు నాగోబా జాతర జరగనుంది. కేస్లాపూర్‌లో నాగోబా దేవాలయం ఉంది. ఈ ఆలయంలో కొలువైన నాగేంద్రుడిని గిరిజనులు భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ క్రమంలోనే ఈ నాగోబా జాతరను పుష్యమాస అమావాస్య సందర్భంగా ప్రారంభించారు. భారీ సంఖ్యలో ఆదివాసీలు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగేంద్రునికి మెస్రం వంశీయుల అభిషేకం, ప్రత్యేక మహా పూజలు చేశారు. మెస్రం వంశంలో కొత్తగా పెళ్లయిన వారు, ఇప్పటి వరకు నాగోబాను దర్శించుకుని మెస్రం కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి భేటింగ్లో పాల్గొన్నారు. ముందుగా పరిచయం కు వచ్చిన కోడళ్లకు మెస్రం వంశం మహిళల సహకారంతో నాగోబా ఆలయం, సతి దేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి దేవతలను చూపించారు. అనంతరం వారు పూర్తిగా మెస్రం వంశంలో చేరినట్లుగా భావిస్తారు. ఇలా రెండు రోజుల పాటు ఆయా దేవతలకు మెస్రం వంశీయులు పూజలు చేయనున్నారు.
నేటి నుంచి భక్తులకు దర్శనం
మహా పూజ, ఇతర కార్యక్రమాల అనంతరం నాగోబా జాతర ఉత్సవాలు మొదలైనట్లు ఆదివాసీలు తెలిపారు. నేటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనం జరగనుంది. ఈ నాగోబా జాతర తెలంగాణలో రెండో అతిపెద్ద గిరిజనుల జాతర గా పేరుగాంచింది. దీనికి తెలంగాణలోని అన్ని జిల్లాల తో పాటు పక్క రాష్ట్రాల్లోని గిరిజనులు పెద్ద మొత్తంలో హాజరవుతారు.ఈ జాతరకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాల నడుమ జాతరకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com