Khairatabad Ganesh: దర్శనమిస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి
తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సప్తముఖ మహాగణపతి పూజలందుకునేందుకు సిద్ధమయ్యాడు. ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. భక్తులు జయజయ ధ్వానాలు నడుమ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు. కాగా, మహాగణపతి పూర్తి స్థాయిలో సిద్ధమై కళ్లను తీర్చిదిద్దడంతో ఉత్సవ కమిటీ తొలిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆగమన్‌లో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ఇక, ఈసారి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉండడం, శని, ఆదివారాలు రెండు సార్లు రావడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిరోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్‌లు పూజలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు 3 షిఫ్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. భారీ గణపతి వద్ద బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలు, 22 ప్లాటూన్ల సిబ్బంది పనిచేస్తారని సైఫాబాద్ ఏసీపీ ఆర్ సంజయ్ కుమార్ తెలిపారు.
దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గణపతి దర్శనం కోసం వచ్చే భక్తులు సొంత వాహనాలను తీసుకురాకపోవడం ఉత్తమం. రైల్వేగేటు నుంచి నడచుకుంటూ వచ్చిన వారినే లోపలికి అనుమతిస్తారు. ఈ మార్గంలో వాహనాలను అనుమతించరు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చిన వారు తమ వాహనాలను ఐమాక్స్ పక్కనున్న పార్కింగ్ స్థలంలో పార్కు చేయాల్సి ఉంటుంది. అలాగే, మింట్ కాంపౌండ్ వైపు వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్కు చేసి, నడచుకుంటూ దర్శనానికి రావాలి. రోడ్లపై వాహనాలను నిలిపితే సీజ్ చేస్తామని, గణపతికి మూడు వైపులా 500 మీటర్ల వరకు నో వెండింగ్ జోన్ ఉందని, చిరు వ్యాపారాలకు అనుమతి లేదని సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com