TG: అంబేడ్కర్‌ మార్గంలోనే సర్కార్ పయనం

TG: అంబేడ్కర్‌ మార్గంలోనే సర్కార్ పయనం
X
రాజ్యాంగం వల్లే తెలంగాణ ఆవిర్భావం... ఘన నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్‌ చేసిన కృషిని మరువలేనిదని సీఎం రేవంత్‌ కొనియాడారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అంబేడ్కర్‌ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్‌ రాజ్యాంగమేనన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని.. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

అంబేడ్కర్ ఓ స్ఫూర్తి: కేసీఆర్

అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేడ్కర్‌ అని కేసీఆర్‌ కొనియాడారు. ముందుచూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరునే పెట్టామని వివరించారు.

పండుగలా జయంతి

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతిని పండుగలా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అంబేడ్కర్‌ జీవిత విశేషాలను తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. ఇటు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న భారీ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఘనంగా నివాళులర్పించన్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు మంత్రులూ ఇందులో పాల్గొననున్నారు. అంబేడ్కర్‌ జయంతి నేపథ్యంలోనే భూభారతి పోర్టల్‌ ఆవిష్కరణతో పాటు ఎస్సీ వర్గీకరణ జీవోను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.

అంబేడ్కర్‌ విగ్రహం శుద్ధి చేసిన కేంద్రమంత్రి

కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ది చేశారు. అంబేద్కర్ 135 జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీజేపీ పిలుపునిచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించింది. దీంతో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సికింద్రబాద్‌లోని సీతాఫల్ మండిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కార్యకర్తలతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు, కార్యకర్తలతో అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు.

Tags

Next Story