Ambedkar Jayanti: తెలంగాణలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

Ambedkar Jayanti: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు. ప్రగతిభవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
అంబేద్కర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని కొందరు తుంగలో తొక్కుతున్నారన్నారు. రాజ్యాంగం ఏ ఒక్క వర్గానిదో కాదు.. అందరిదని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అన్నివర్గాల వారు ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు మంత్రి హరీష్‌రావు.
సిద్ధిపేటలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన నివాళులర్పించారు. అంబేద్కర్ కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు మంత్రి పువ్వాడ అజయ్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు తెచ్చామన్నారు. అటు.. మహబూబాబాద్‌లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఆయన ఆశయాలు సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. జనగామ జిల్లా చిన్నమాడుర్‌లో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఖర్చులు అన్ని తానే భరిస్తానన్నారు. అంబేద్కర్ అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com