Amit Shah: మునుగోడులో బీజేపీ ఆత్మగౌరవ సభకు ఏర్పాట్లు.. అమిత్‌షా సమక్షంలో..

Amit Shah: మునుగోడులో పొలిటికల్ హీట్ పెరిగింది. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా ఎన్నికల ప్రచార సభలతో షెడ్యూల్‌కు ముందే ఎన్నికల వేడి రాజుకుంది. ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. ఆత్మగౌరవ సభ పేరుతో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. అమిత్ షా సమక్షంలో కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేశారు. అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం 3 గంట 40నిమిషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి రక్షణ శాఖకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు మునుగోడుకు చేరుకుంటారు. 4.35 నుంచి 4.50 వరకు సీఆర్పీఎఫ్ అధికారులతో రివ్యూ చేస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మునుగోడు సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాప్టర్‌లో తిరిగి 6.4 5కు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 6.45 నుంచి 7.30 గంటల వరకు రామోజీ ఫిలిం సిటీలో గడుపనున్నారు. రాత్రి 8 గంటలకు శంషాబాద్‌లో నోవాటెల్ హోటల్‌కు చేరుకుని.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేస్తారు. అక్కడే డిన్నర్ ముగించుకుని రాత్రి 9.40కు ఢిల్లీ బయలుదేరుతారు. మునుగోడు శివారులో సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు జరిగాయి. భారీ వర్షం వచ్చినా సభకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఉండేందుకు జర్మనీ టెక్నాలజీ టెంట్లు ఏర్పాటు చేశారు. ప్రధాన సభా వేదిక, వాటి పక్కన మరో రెండు వేదికలు, సాంస్కృతిక బృందాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. కనీసం లక్ష మందికి సరిపోయేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.
సభ సక్సెస్ కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని నియమించింది. మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను కూడా నియమించింది. వివేక్ వెంకటస్వామి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో, హైదరాబాద్ నుంచి మునుగోడు మార్గంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు, కమలం తోరణాలు కట్టి మొత్తం కాషాయ మయం చేసే ఏర్పాట్లలో బీజేపీ నిమగ్నమైంది. భారీ జనసమీకరణపై నేతలు నిమగ్నమయ్యారు.
బీజేపీకి భయపడి ముందే కేసీఆర్ సభ పెట్టారు ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమకు పోటీగా సభలు పెట్టినా.. భయపడేది లేదన్నారు. మునుగోడు రోడ్లపై కేసీఆర్... కుర్చీ వేసుకుని కూర్చున్నా.. ఓటమి తప్పదన్నారు. మొత్తానికి ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో జోష్ మీదున్న బీజేపీ.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com