Amit Shah: ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా

Amit Shah: ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
ఎన్నికల తర్వాత తొలిసారి

లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్‌లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా సమావేశం నిర్వహించనున్నారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు 1200 మందితో భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే రోజు అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను నిర్ణయించనున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో పది పార్లమెంట్ సీట్లు గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి‌ సీనియర్లు కిషన్ రెడ్డి, డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, జితేందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, కొండా, బూర నర్సయ్య గౌడ్ తదితరులు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో సీనియర్ నేతలు ఓడిపోయినప్పటికీ..మంచి ఓటు పర్సంటేజీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. 8 స్థానాల్లో గెలవడమే కాకుండా మరో 18 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ బాగా బలపడుతోందని హైకమాండ్ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో పార్టీ నేతకు దిశానిర్దేశం చేయాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు వర్గ పోరాటానికి దిగడంతో పార్టీ ఎక్కువగా నష్టపోయింది. సీనియర్లు అందరూ ఓడిపోవడానికి వర్గ పోరాటమే కారణమని భావిస్తున్నారు.

ఈ క్రమంలో అందరి నేతల మధ్య సమన్వయం కోసం.. అమిత్ షా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్లతో పాటు కొంత మంది ప్రముఖ వ్యక్తుల్ని కీలక నియోజకవర్గాల్లో పోటీకి పెట్టే అవకాశాలపై ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సీనియర్లను పార్లమెంట్ బరిలోకి దింపేందుకు హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఎంపీలు సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ ఎక్కువ ఫలితాలు సాధించిన చోట.. గ్రేటర్ పరిధిలో ప్రత్యేకమైన దృష్టి సారించాలని .. బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story