AMIT SHAH: ఇవీ దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు

AMIT SHAH: ఇవీ దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు
బీజేపీని గెలిపించాలని ప్రజలకు అమిత్‌ షా పిలుపు... అధికారంలోకి వస్తే అవినీతి కేసీఆర్‌పై విచారణ జరుపుతామని హామీ

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో.. భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచింది. కేంద్రమంత్రులు మూకుమ్మడిగా తెలంగాణపై దండయాత్రలా ప్రచారం చేస్తున్నారు. జనగామ, మెట్‌పల్లిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయించనున్నాయని జనగామలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో అమిత్‌ షా పేర్కొన్నారు. ఓవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాలు జరపలేదన్న అమిత్‌ షా.. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతామన్నారు. భైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తామన్నారు.


అవినీతిలో దేశంలోనే కేసీఆర్‌ ప్రథమ స్థానంలో ఉన్నారని అక్రమాలకు పాల్పడిన వారందరిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామంటూ కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పునరుద్ఘాటించారు. రానున్న ఎన్నికలు తెలంగాణతోపాటు దేశ భవిష్యత్‌ను మార్చనున్నాయంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌, కాంగ్రెస్‌ కలిసే ఉన్నాయని అవి 2G, 3G, 4G పార్టీలు ఉంటూ అమిత్‌ షా ఎద్దేవా చేశారు.

జనగామ సభ అనంతరం అమిత్‌ షా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సకల జనలు విజయసంకల్ప సభకు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఒకసారి దీపావళి జరుపుకున్నారని.. డిసంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండోసారి అయోధ్యలో రామమందిరం ప్రారంభమయ్యాక మూడోసారి దీపావళి చేసుకుందామంటూ.. చమత్కరించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాతో పోరాడారని బోర్డు ఏర్పడటంతో రైతుల ఆకాంక్షలు నెరవేరాయని అమిత్‌ షా వెల్లడించారు. అధికారంలోకి వస్తే మూతపడిన మూడు చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. మొక్క జొన్న నుంచి తయారు చేసి ఇథనాల్‌ పరిశ్రమను నెలకొల్పుతామన్నారు. అలాగే నిజామాబాద్‌లో 500 పడకలతో బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి నిర్మాణం చేపడతామని.. హామీ ఇచ్చారు. తెలంగాణలో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని అమిత్‌షా అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం కుటుంబ పార్టీలన్న షా... బీజేపీ తెలంగాణ ప్రజల పార్టీ అని.. మోదీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు.. మోదీ కొత్త పార్లమెంట్‌ నిర్మించి దేశం గర్వించేలా చేశారని గుర్తు చేశారు. జనగామ, మెట్‌పల్లిలో సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొన్న అనంతరం అమిత్‌ షా ఉప్పల్‌ నియోజకవర్గంలో NVSS ప్రభాకర్‌కు మద్దతు రోడ్‌ షోలో పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story