Telangana Liberation Day: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు.. ముఖ్య అతిథిగా అమిత్‌షా

Telangana Liberation Day: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అమరవీరులకు నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటిసారిగా తెలంగాణలో విమోచన దినోత్సవాలు జరుగుతున్నాయి.
విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి అమిత్‌షా.. జాతీయ జెండా ఆవిష్కరించి ఏడాది పాటు జరగనున్న అమృత్ మహోత్సవ్ వేడుకలు ప్రారంభించారు. ఆ తర్వాత సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కర్నాటక తరపున మంత్రి హాజరయ్యారు.
అమరవీరులకు నివాళులు అర్పించిన అమిత్ షా.. ఆ తరువాత సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాద్ రాష్ట్రం భారత్ యూనియన్‌లో కలిసిన సందర్భంగా 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మళ్లీ ఇన్నాళ్లకు ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్న కేంద్రం.. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులతో వేడుకలు నిర్వహించారు. 12 కేంద్ర పారామిలటరీ బృందాలు ప్రత్యేక పరేడ్ నిర్వహించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com