మరికాసేపట్లో ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం..!

ఈ ఉదయం పదకొండున్నరకు ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది. దళిత సాధికారతే ప్రధాన ఎజెండాగా సమావేశం జరగబోతోంది. సీఎం కేసీఆర్‌తో జరిగే ఈ సమావేశానికి అన్ని ప్రధాన పార్టీలకు ఆహ్వానం అందింది. సీపీఐ, సీపీఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాలని సీఎం కేసీఆరే స్వయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు రావాలని కోరారు. సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ, సీఎంవో అధికారులు, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ఈ సమావేశానికి అన్ని పార్టీల నుంచి దళిత ప్రజాప్రతినిధులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం శాసనసభాపక్ష నేతలు కూడా పాల్గొంటారు. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మీటింగ్ ఎన్నికల స్టంట్ అని, అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో దళితుల పురోభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు మందకృష్ణ మాదిగ.
సమావేశాలు జరిపి, తీర్మానాలు చేయడంతో సరిపెట్టుకోకుండా సత్వర కార్యాచరణ ప్రకటించాలన్నారు. మరోవైపు ఈ అఖిలపక్షానికి దళిత సంఘాల నేతలను పిలవకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ సమావేశానికి 32 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో దళితుల సాధికారికతకు అవసరమయ్యే విధివిధానాలను రూపొందించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com