ANDESRI: అశ్రు నయనాలతో అందెశ్రీకి అంతిమ వీడ్కోలు

ప్రముఖ కవి, రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్కేసర్లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఈ అంతిమ సంస్కారాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా కవి అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు. అందెశ్రీ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. అంతకుముందు లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది.అనంతరం పోలీసు లాంఛనాలతో ప్రభుత్వం అధికారికంగా అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించి ప్రజాకవిని సాగనంపింది.
పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఉదయం సీనియర్ నేత కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీనియర్ నేత వీహెచ్‌లు అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. అభిమానులు, సాహితీ ప్రియులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. 500 మంది కళాకారులు యాత్ర సాగుతున్నంతసేపు ఆడిపాడారు. అమర్ రహే అందె శ్రీ అంటూ కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానుల ఆశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. అందెశ్రీ సోమవారం గుండెపోటుతో మరణించారు. ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాష్ రూమ్ దగ్గర పడిపోయారు. గుర్తించిన కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

