ANGANWADI PROTEST: అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం

ANGANWADI PROTEST: అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తం
X
తమపై మగ పోలీసులు దాడి చేశారన్న అంగన్‌వాడీలు.. మహిళా ఎస్‌ఐను జుట్టు పట్టి లాగేసిన కార్యకర్తలు...

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట జరిగింది. ఓ కార్యకర్త స్పృహ కోల్పోవడంతో ఆమెను రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. తోపులాటలో పలువురు అంగన్‌వాడీ ఉద్యోగులు మహిళా ఎస్సై జుట్టు పట్టుకొని లాక్కెళ్లడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అంగన్‌వాడీ ఉద్యోగులను, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


తలమడుగు ఎస్‌ఐ ధనశ్రీని, మహిళా హోంగార్డులను లాగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్‌ఐ ధనశ్రీని జుట్టు పట్టి అంగన్‌వాడీ కార్యకర్తలు ఈడ్చుకెళ్లగా పోలీసులు బలవంతంగా నిరసనకారుల నుంచి విడిపించారు. బాధ భరించలేక ఎస్‌ఐ ఘటనాస్థలంలోనే కన్నీరుపెట్టుకుంటూ జడను సవరించుకోవడం కనిపించింది. మరోవైపు అదుపులోకి తీసుకున్న నేతలను వాహనాల్లో తరలించడంతో కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కుమురం భీం చౌక్‌ వైపు పరుగులు పెట్టారు. వారిని డీఎస్పీ ఉమేందర్‌ బెల్టు పట్టుకుని నిలువరించే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వారంతా టూటౌన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి బైఠాయించారు.


ఆ తర్వాత అక్కడ నాయకులు లేరని తెలిసి కలెక్టరేట్కు తిరిగి వచ్చి ప్రధాన ద్వారం ఎదుట కూర్చున్నారు. అదే సమయంలో బేల మండలం సైద్‌పూర్‌కి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త ప్రగతి స్పృహతప్పి పడిపోగా తోటి కార్యకర్తలు సపర్యలు చేసి 108 అంబులెన్సులో ఆమెను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఎస్‌ఐ పరుష పదజాలంతో దూషించడం వల్లనే తమ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించిందని, తోపులాటలో తమకు గాయాలయ్యాయని, చీరలు ఊడిపోయాయని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత కె.సునీత వాపోయారు.


తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కావా లనే మగ పోలీసులతో తమను అడ్డుకున్నారంటూ అంగన్‌వాడీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ చీరలు, జాకెట్లు పట్టుకొని లాగారని, పోలీసులే తమపై దాడిచేశారంటూ ఆరోపించారు. కొన్ని యూనియన్లు తప్పుదోవ పట్టించడం వల్లే అంగన్‌‌వాడీలు సమ్మె చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ ఆరోపించారు. వెంటనే సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెతో బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

Tags

Next Story