Rajya Sabha: నేడు రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..

రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రేపటితో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండడంతో అభ్యర్థుల ఎంపికపై AICC కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం కోటా అభ్యర్థి OC అయితే... రాష్ట్రం నుంచి BC లేదా ST సామాజికవర్గం అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 8న మొదలై రేపటితో ముగియనుంది. ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో ఉన్న పార్టీల బలాబలాల ప్రకారం చూస్తే రెండు కాంగ్రెస్‌కు, ఒకటి భారాసకు దక్కనున్నాయి. మొదట మూడింటికి పోటీ చేయాలని భావించిన కాంగ్రెస్... తర్వాత రెండింటితోనే సరిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేసేందుకు ఒక్క రోజే గడువు ఉండడంతో... అభ్యర్థుల ఎంపికపై AICC కసరత్తు తుదిదశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. AICC కోటా కింద పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆయన రేపు హైదరాబాద్ రానున్నారు.
రెండో సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. ప్రధానంగా ఒకటి OC సామాజికవర్గం, మరొకటి BC లేదా STకి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వంతోపాటు AICC యోచిస్తోంది. అజయ్ మాకెన్ OC కావడంతో.. రాజ్యసభ ఆశిస్తున్నజానారెడ్డి, చిన్నారెడ్డి, రేణుకా చౌదరిలకు అవకాశం లేనట్లేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. BC. ST నుంచి రాజ్యసభ ఆశిస్తున్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వి. హనుమంత రావుతోపాటు జి. నిరంజన్ సహా పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ కోసం VH అహర్నిశలు కష్టపడుతున్నట్లు భావిస్తున్న పార్టీ ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. MLA టికెట్ ఆశించిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, అజారుద్దీన్‌లు కూడా పోటీపడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరిని రాజ్యసభ వరిస్తుందో... ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో మాట్లాడిన తరువాత AICC అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. మూడు స్థానాలకు ముగ్గురు నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవమవుతాయి. ఈ నెల 20న నామినేషన్ల ఉపసంహరణ ఉండడంతో అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com