TS: రూ. 3.500 కోట్లతో ఏఐ డేటా సెంటర్

తెలంగాణలో రూ. 3,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్టీ టెలీమీడియా గ్లోబల్ డేటా సెంటర్ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ ముచ్చర్ల సమీపంలోని మీర్‌ఖాన్‌పేటలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సింగపూర్‌లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సీఎం సమక్షంలో స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్.. ఎస్టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్.. ఏఐ డేటా సెంటర్ కోసం ఒప్పందంపై సంతకాలు చేశారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పే ఈ డేటా సెంటర్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం ఉంటుందని సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దాదాపు రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకు రావటం ద్వారా తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రపంచస్థాయి సంస్థలకు అనుకూలంగా ఉన్నట్లు చాటిచెప్పినట్లయిందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com