TS: తెలంగాణలో ఏఐ డేటా సెంటర్

తెలంగాణలో ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను సమీకరించింది. హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ కంపెనీ, కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్‌సీఎల్ ముందుకొచ్చాయి. రూ.10 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ తో 3,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
ఉపాధి అవకాశాలు పెరుగుతాయి..
తెలంగాణలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఏఐ డేటా సెంటర్ మైలురాయిగా నిలుస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఐటీ సేవల సామర్థ్యం పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో తెలంగాణలో ఐటీ సేవల ప్రమాణాలు మరింత వృద్ధి సాధిస్తాయని కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.
ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతాం
ట్రిలియన్ మొక్కలు నాటి భూమిని సతత హరితంగా మార్చే ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం’లో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలుపంచుకుంటా నని ప్రతిజ్ఞ చేశారు. ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు దావోస్ లో తెలంగాణ పెవిలియన్ ను సందర్శించి.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పర్యావరణ ప్రమాణం చేయించారు. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి అంశంలోనూ నెట్ జీరో విధానాల ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్ పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com