TG: తెలంగాణలో మరో నాలుగు మెడికల్‌ కాలేజీలు

TG: తెలంగాణలో మరో నాలుగు మెడికల్‌ కాలేజీలు
X
అనుమతి ఇచ్చిన జాతీయ వైద్య మండలి.. అందుబాటులోకి 200 MBBS సీట్లు

తెలంగాణలో మరో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇచ్చింది. యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు జారీ చేసింది. దీంతో మరో 200 ప్రభుత్వ ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024-25 విద్యా సంవత్సరానికి కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎన్‌ఎంసీకి ప్రతిపాదనలు పంపగా.. గత నెల ములుగు, నర్సంపేట, గద్వాల, నారాయణపేటకు అనుమతి ఇవ్వగా మరో నాలుగింటిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి-భువనగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, మెదక్‌ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి వీలుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వాటిలో లోపాలు సరిదిద్దింది. ఈ నాలుగు చోట్ల 220 పడకల ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఎన్‌ఎంసీ నిర్దేశించిన మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించింది. రెండు వారాల క్రితం మరోమారు అనుమతికి దరఖాస్తు చేయగా అన్ని అంశాలను పునఃపరిశీలించిన ఎన్‌ఎంసీ ఆమోదముద్ర వేసింది . దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది.

8 కాలేజీలకు దరఖాస్తులు

ఈ ఏడాది మొత్తం 8 కాలేజీలకు ప్రభుత్వం దరఖాస్తు చేసింది. జూన్‌లో ఈ కాలేజీల పరిశీలనకు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు, ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీచింగ్ స్టాఫ్, సౌకర్యాలు లేకుండా అనుమతులు ఇవ్వలేమన్నారు‌. అధికారులు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకురావడంతో, అవసరమైన నిధులను కొత్త సర్కార్ కేటాయించింది. ఎన్‌ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్ తర్వాత ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చిన ఎన్‌ఎంసీ, మిగిలిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ కాలేజీల అనుమతులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా రెగ్యులర్‌గా మానిటర్ చేసి, యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు స్టాఫ్‌ను నియమించారు.

ఇటీవల జరిగిన జనరల్ ట్రాన్స్‌ఫర్లలో తొలుత ఆ 4 కాలేజీల్లోని ఖాళీలను నింపిన తర్వాతే, మిగిలిన కాలేజీల్లోకి స్టాఫ్‌ను బదిలీ చేశారు‌. ప్రొఫెసర్ల కొరతను అధిగమించేందుకు ఎలిజిబిలిటీ ఉన్న వారికి ప్రమోషన్లు ఇప్పించారు. కాలేజీ, హాస్పిట‌ల్‌లో ఉండాల్సిన లాబోరేటరీ, డయాగ్నస్టిక్స్ ఎక్వి‌ప్‌మెంట్ కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించారు.

Tags

Next Story