AP: మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన్ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించినా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయన్ను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు.
ఏపీ ప్రభుత్వం కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, మరో రాష్ట్రంలో అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి సోమేశ్ ఇష్టపడలేదు. దీంతో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. సోమేష్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు ఏపీ సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. రెండ్రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. వాస్తవానికి సోమేశ్ ఈ ఏడాది డిసెంబర్ వరకూ సర్వీస్‌లో కొనసాగాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్టులో కొనసాగడానికి వీలుగా ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే.. సోమేష్ కుమార్ తెలంగాణకు తిరిగి వస్తే ఆయనకు సీఎం కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు? ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పిస్తారా లేదా కీలక శాఖల నిర్వహణ బాధ్యతలు ఇస్తారా? ఇదే అంశంపై తెలంగాణ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com