SHARMILA: వైసీపీ ఒక తోక పార్టీ: షర్మిల

దివంగత నేత వైఎస్‌ఎస్ ఆశయాలను మాజీ సీఎం జగన్ తుంగలో తొక్కినందునే ప్రజలు ఘోరంగా ఓడించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వైఎస్ మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని విస్మరించిందని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో రూ.4వేల కోట్లు బకాయిలు పెండింగులో ఉంచిందని అందుకే ప్రజలు ఓడించారని తెలిపారు. వైసీపీ నాయకులు హత్యారాజకీయాలు, గూండాయిజం చేసి ఉండొచ్చని... కానీ దానికీ వైఎస్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. వైఎస్ విగ్రహాలను ధ్వసం చేస్తే అక్కడికెళ్లి ధర్నా చేస్తామని షర్మిల హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌కి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్టమైన ప్రాజెక్టని తెలిసి కూడా అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఆ సంస్థని కాపాడటానికి ప్రయత్నించలేదని షర్మిల మండిపడ్డారు. పైగా అది నష్టాల్లో ఉందా అని తెలియనట్లు అడిగారన్నారు. వైసీపీ తోకపార్టీ. భాజపాకు ఊడిగం చేసి, ప్రతి బిల్లుకూ మద్దతిచ్చిందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి సంబంధించిన వ్యాపారులు, నాయకులకు రాజ్యసభ.. టీడీడీలో.. ఏది అడిగితే ఆ పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ తాకట్టుపెట్టిందన్నారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నికలోనూ జగన్ బీజేపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు. మణిపుర్ ఘటనతో సహా ఏది చూసినా జగన్ బీజేపీతోనే ఉన్నారని తెలిపారు. బీజేపీకి తొత్తుగా, తోకపార్టీగా ఉన్నది వైసీపీనే అని షర్మిల ధ్వజమెత్తారు.
చంద్రబాబు సమీక్ష
జగన్ పాలనలో రహదారులపై మోకాల్లోతు గోతులతో ఆంధ్ర ప్రజలు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టే దిశగా చర్యలకు ఉపక్రమించింది. రహదారులపై ఉన్న గుంతలు, మినీ చెరువులను పూడ్చివేయాలని రోడ్లు భవనాల శాఖను చంద్రబాబు ఆదేశించారు. దీనికి అవసరమైన రూ.286 కోట్ల నిధులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. తక్షణమే పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతుల్లో థర్మ్‌ల్ విద్యుత్ ప్లాంట్ల నుంచివచ్చే ప్లైయాష్ వినియోగంపై పైలెట్ అధ్యయనం చేయాలని సూచించారు. శాస్త్ర, ఇంజనీరింగ్ నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని ఆర్‌అండ్‌బీని ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర రహదారులపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి కాంతిలాల్ దండే, ఇంజనీరింగ్ చీఫ్‌లు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 7,087 కిమీ పరిధిలో తక్షణమే మరమ్మతులు చేపట్టాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ గణాంకాలపై సీఎం విస్తుపోయారు. ఇన్ని వేల కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయకుండా ఎలా ఉన్నారని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com