ముగిసిన అఖిలప్రియ మూడు రోజుల కస్టడీ

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ మూడు రోజుల కస్టడీ ముగిసిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. అయితే బెయిల్ పిటిషన్ పై శనివారం కోర్టు విచారణ చేపట్టనుంది. దీంతో అఖిలప్రియను చంచల్ గూడ జైలుకు తరలించారు అధికారులు.
ఉదయం బేగంపేట ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో అఖిల ప్రియకు కరోనా పరీక్షలు చేయించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా అఖిలప్రియను న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లిన పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మూడు రోజుల పాటు అఖిలప్రియను విచారించి నివేదికను కోర్టుకు సమర్పించారు పోలీసులు.
నిన్నటితో అఖిలప్రియ కస్టడీ ముగిసింది. ఈ మూడు రోజుల పాటు అఖిలప్రియను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. అఖిలప్రియకు దాదాపు 300పైగా ప్రశ్నలు వేశారు పోలీసులు. కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్ డేటా, సిమ్ లోకేషన్, సీసీ ఫుటేజ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఇదిలా ఉంటే పరారీలో ఉన్న భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డితో పాటు మిగతా నిందితుల కోసం పోలీసులు.. బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాయి. వీళ్లను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ నెల 5న ప్రవీణ్‌రావు సోదరులను కిడ్నాప్ చేయించిన వీరిద్దరూ.. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
అనంతరం వారిని వదిలేసి వేర్వేరు మార్గాల్లో హైదరాబాద్ దాటి వెళ్లారని కొన్ని గంటలపాటు భార్గవరామ్, గుంటూరు శ్రీనులు ఫోన్లలో మాట్లాడుకున్నాక పోలీసులకు దొరకకూడదని తమ సిమ్‌కార్డులను పారేశారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com