హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి, ట్రాఫిక్ మళ్లింపు..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభయాత్రల్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ప్రవేశాలపైనా నిషేధం విధించనున్నారు. పలుచోట్ల ఆర్టీసీ బస్సుల దారి మళ్లించనున్నట్టు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎన్‌టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. బడా గణేష్‌ను తరలించడానికి ట్రాలీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయమే బడా గణేష్ భక్తులకు వీడ్కోలు పలికి నిమజ్జనానికి బయలుదేరి వెళతాడు. గణేశ్ నిమజ్జన సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా ట్యాంక్‌బండ్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో సమస్యలొస్తే కంట్రోల్ రూమ్ నెంబర్లు 79015 30966, 79015 30866 లకు ఫోన్ చేయొచ్చని తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ 565 బస్సులను ప్రత్యేకంగా నడపనుంది. దక్షిణ మధ్య రైల్వే 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈనెల 19న నగరంలోని 29 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. హుస్సేన్ సాగర్ సమీపం వరకు బస్సులను నడపనున్నారు. బషీర్‌బాగ్, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, ఇందిరాపార్కు, లక్డికాపూల్, ఖైరతాబాద్‌కు చేరుకునేలా గణేష్ నిమజ్జనం స్పెషల్ పేరుతో బస్సులను నడపనున్నారు. ప్రయాణికులు సమాచారం కోసం 9959226154, 9959226160 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com