యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి రంగం సిద్ధం

తెలంగాణ తిరుమలగా భావిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. 2015 నుంచి జరుగుతున్న పునర్నిర్మాణ పనులు 99శాతం మేర పూర్తి అయ్యాయి. అలాగే ప్రధాన ఆలయ నిర్మాణ పనులు కూడా 90శాతం పూర్తయ్యాయి.. దీంతో త్వరలోనే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనుంది ప్రభుత్వం.
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తిరుమల తరహా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించారు. అందమైన శిల్పాలతో పాటు భక్తులకు కనువిందు చేసే ఆలయ గోపురాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇప్పటివరకు ప్రధాన ఆలయం నిర్మాణానికి 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. త్వరలోనే 46 కోట్ల రూపాయలతో విమాన గోపురానికి బంగారు తాపడం చేయించనున్నారు.
850 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణం జరగనుండగా.. అందులో 250 ఎకరాలను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. అలాగే 108 అడుగుల క్షేత్రపాలక ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. భక్తులు పుష్కరిణీలో స్నానం చేసేందుకు వీలుగా కొండకింద చెరువును సుందరీకరణ చేస్తున్నారు. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు లైన్ల రహదారులను వేగవంతంగా నిర్మించడంతో పాటు రాష్ట్రం నలువైపుల నుంచి ప్రతిరోజు 500కు పైగా బస్సులు యాదాద్రికి నడిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com