Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు.. గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు..

Munugodu: మునుగోడు ఉప ఎన్నికలు.. గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు..
Munugodu: తెలంగాణలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి.

Munugodu: టీఆర్‌ఎస్-2 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తెలంగాణలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాతో ఇప్పుడు ఐదో బైపోల్ మునుగోడు రూపంలో వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు టీఆర్‌ఎస్‌ సైతం.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పెండింగ్‌ పనులపై దృష్టిసారించింది కేసీఆర్‌ సర్కారు. డిండీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న రిజర్వాయర్లలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు మల్లన్నసాగర్ మాదిరిగా న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇక.. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఉన్నత విద్యను పొందలేకపోతున్నామని అసంతృప్తితో ఉన్నారు మునుగోడు ప్రజలు. ఇప్పటివరకు 100 పడకల ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోడ్ల పరిస్థితి మరింత అధ్వాహ్నంగా ఉందనే చెప్పాలి. ప్రధాన రోడ్లు మినహాయిస్తే.. మండలాలు, గ్రామాలకు ఉన్న లింక్ రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. 2015 జూన్‌లో నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ సమస్యను ఎదుర్కొనేందుకు కీలకమైన డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్‌.

మునుగోడు పరిధిలో శివన్నగూడెం-చర్లగూడెం, కృష్ణరాయన్ పల్లి రిజర్వాయర్ల ద్వారా.. దేవరకొండ, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీరు, సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిజానికి.. డిండి ఎత్తిపోతల పథకం పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని గత ఏడాది జనవరిలో జరిగిన సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖను ఆదేశించారు కేసీఆర్. కానీ ఇప్పటికి పనులు కొనసాగుతున్నాయి. ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస పనులను త్వరగా పరిష్కరించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉండగా.. తాజాగా జాబితాలోకి గట్టుపల్ మండలం చేరింది. ఈ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నాంపల్లి మండలంలో ప్రజారవాణా సేవలు మరింత మెరుగుపడాలంటున్నారు. ఏడు మండలాల్లో చూసుకుంటే.. నాంపల్లి మండల ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. కిష్ణరాంపల్లి, చర్లగూడెం ప్రాజెక్టు వలన మర్రిగూడ మండల ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. మిగిలిన మండలాల్లోనూ తమ సమస్యలు పరిష్కరించాలంటున్నారు. ఇక.. చండూరు మండలంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉంది.

ఈ పడమటతాళ్ల తండాలోమాత్రం మాకు రోడ్లేస్తేనే.. మీకు ఓట్లస్తాంమంటున్నారు. ఏకంగా ఫ్లెక్సీలు పెట్టడం కలకలం రేపింది. మరోవైపు.. మునుగోడు గ్రామ పంచాయితీ కార్యలం ముందు.. గ్రామంలోని వార్డు సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ ఆల్టిమేటం ఇచ్చారు. గ్రామంలో అభివద్దికి నిధుల్లేవంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇక రైతులు రైతు బంధు, రైతు భీమా పథకాలపై సంతోషంగా ఉన్నా పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల పంట రుణాల మాఫీ అడుగుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఎక్కువ జనాభా నివశిస్తుండగా.. అందుకు తగ్గట్టుగా పట్టణం అభివద్ది జరగలదు.

రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కులు, సీసీ రోడ్లు వంటి మౌళిక సదుపాయాల కల్పన చేపట్టాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇక కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఇవి నిబంధనలను తుంగలో తొక్కి.. వ్యర్థాలను ఇష్టానుసారంగా, యధేచ్చగా పారబోస్తున్నాయి. ఇక పింఛన్లు, రేషన్ కార్డుల కోసం చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు పూర్తిగా క్షేత్రస్తాయిలో అందట్లేదు.ఇలా నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలపై టీఆర్‌ఎస్‌ దృష్టిపెట్టింది. మరోవైపు రాజీనామాతోనే ప్రభుత్వం, అధికార యంత్రాంగం కదిలిందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story