భాగ్యనగరిలో వైభవంగా ఆషాడమాస బోనాలు..!

భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను నగర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట ఉత్సవాలు ఘనంగా జరుగగా.. ఆదివారం లష్కర్ భక్తులు బోనమెత్తారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో సికింద్రాబాద్ పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొట్టెలు, ఫలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రులు, సీఎం సతీమణి పట్టువస్ర్తాలు, బోనం, ఒడిబియ్యం సమర్పించారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళీ జాతరలో కీలకమైన రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. బోనాల పండుగ మరుసటిరోజు అమ్మవారి ఆలయంలో బలిపూజ నిర్వహిస్తారు. తర్వాత ఆలయంలోని మాతాంగేశ్వరి దేవాలయం ఎదుట జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తారు. రంగం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారిని అంబారీపై దేవాలయం చుట్టూ ఊరేగించి మెట్టుగూడలోని దేవాలయానికి సాగనంపుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com