Assembly Session: గవర్నర్ ప్రసంగంలో అబద్దాలే ఎక్కువ : జీవన్ రెడ్డి

గవర్నర్ ప్రసంగం లేకుండా ఉంటేనే బాగుండేదన్నారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి. కేసీఆర్ సర్కారు.. సత్యదూరమైన ప్రసంగాన్ని గవర్నర్ నోట పలికించిందంటూ మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఎక్కడ ఉందో ప్రభుత్వం చూపిస్తుందా? అని ప్రశ్నించారు. సీఎండీనే 24 గంటల కరెంట్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. పంటల బీమా అమలు చేసినా రైతులకు లాభమయ్యేదని అన్నారు. తెలంగాణలో దీన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదన్నారు గవర్నర్ తమిళిసై. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు గవర్నర్ తమిళిసై. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com