Khammam: ఉద్యోగం నచ్చలేదు.. హమాలీగా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్..
Khammam: ఎవరి జీవితం వారికి నచ్చట్లేదు.. ఏదో తెలియని అసంతృప్తి.. ఎవరికీ చెప్పుకోలేని బాధ.. ఒక్కోసారి ఏం చేస్తున్నారో వారిక్కూడా అర్థం కాదు.. ఇంజనీరింగ్ విద్యార్థులకు చదువు చెప్పే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి తన వ్యక్తిగత, వృత్తిగత జీవితం నచ్చలేదు.. హమాలీగా మారి అక్కడా, ఇక్కడా కూలి పనులు చేస్తున్నాడు.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రోఫెసర్‌గా పని చేస్తూ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ నెల 7న ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. పది రోజులైనా అడ్రస్ లేడు. ఆందోళన చెందిన హాస్టల్ నిర్వాహకులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
తెలిసిన ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాగే ఇంటి నుంచి కూలి పనులు చేసే వాడని పోలీసులకు కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో పోలీసులు తెల్లవారుజామున మార్కెట్ వద్ద నిఘా పెట్టారు. ఊహించినట్లే అతడు మార్కెట్‌లో హమాలీ పనుల కోసం వచ్చాడు. అక్కడ పని చేస్తున్న అతడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మానసిక వేదనతో బాధపడుతున్న అతడికి కౌన్సిలింగ్ ఇప్పించమని కుటుంబసభ్యులకు పోలీసులు సలహా ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com