ALLU ARJUN: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్

ALLU ARJUN: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. నిందితులకు బెయిల్
X
సంయమనం పాటిస్తామన్న అల్లు అరవింద్.. బన్నీ ఇంటి వద్ద కొనసాగుతున్న హై టెన్షన్

సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మృతిని నిరసిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నిన్న (ఆదివారం) అల్లు అర్జున్ నివాసంపై ఆరుగురు యువకులు దాడి చేయడంతో పూలకుండీలు ధ్వంసమయ్యాయి. రాళ్లు విసరడంతో ఇంట్లో వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో దాడి చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేశారు. బన్నీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీలు ధ్వంసం చేసి నానా హంగామా చేశారు. అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, నేడు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

సంయమనం పాటిస్తాం: అల్లు అరవింద్

తన ఇంటిపై ఓయూ విద్యార్థుల జేఏసీ చేసిన దాడి ఘటనపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. అందరూ సంయమనం పాటించాలని.. అదే అందరికీ మంచిదని, తమ ఇంటి బయట జరిగిందంతా ప్రజలు చూశారని అల్లు అరవింద్ అన్నారు. ఇంటి ముందు ఆందోళన చేసిన వారిని పోలీసులు వచ్చి తీసుకెళ్లి కేసు పెట్టారని తెలిపారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ఇంటి వద్ద టెన్షన్

జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ బాధ్యుడని ఆరోపిస్తూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో బన్నీ ఇంటి మీద రాళ్లను విసిరారు. అదేవిధంగా ఆయన ఇంటి ఆవరణలోని పూల కుండీలు ధ్వంసం చేశారు. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags

Next Story