Avula Subba Rao: సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసు.. ఆవుల సుబ్బారావుకు 14 రోజుల రిమాండ్..

Avula Subba Rao: సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావును చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. విధ్వంసానికి ప్రేరేపించినట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. సుబ్బారావును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుబ్బారావుపై మొత్తం 25 సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు రైల్వే పోలీసులు. ఆవుల సుబ్బారావును కోర్టులో ప్రవేశపెట్టడంతో.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. సుబ్బారావుతో పాటు మరో ముగ్గురు నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచారు.
సుబ్బారావు అరెస్టులో కీలక అంశాలు నమోదుచేశారు పోలీసులు. కుట్ర కోణంలోనే సికింద్రాబాద్ అల్లర్లు జరిగాయని రైల్వే పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనక సుబ్బారావు పాత్రపై ఆధారాలు కూడా సేకరించారు. అసలు ఆర్మీ అభ్యర్ధులను సికింద్రాబాద్‌కు తరలించింది సుబ్బారావేనని తేల్చారు. సికింద్రాబాద్ సమీపంలోని 8 ఫంక్షన్ హాళ్లలో అభ్యర్థులకు ఆశ్రయం కల్పించినట్టు ఆధారాలు సేకరించిన రైల్వే పోలీసులు..
సుబ్బారావు కనుసన్నల్లోనే అల్లర్లు జరిగాయని నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం మొత్తం 8 వాట్సాప్ గ్రూప్‌లను సుబ్బారావు క్రియేట్ చేశాడని, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా అభ్యర్థులను రెచ్చగొట్టాడని రైల్వే పోలీసులు తేల్చారు. బిహార్ తరహాలో విధ్వంసం చేయాలని వాయిస్ మెస్సేజ్‌లు పంపిన సుబ్బారావు.. 16వ తేదీ సాయంత్రమే సుబ్బారావు హైదరాబాద్ చేరుకున్నారని కొన్ని ఆధారాలు సేకకించారు. అల్లర్ల కోసం 35వేలు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు రైల్వే పోలీసులు.
విధ్వంసాన్ని సుబ్బారెడ్డి అనుచరుడు బసిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు. స్టేషన్‌లో అల్లర్లు, విధ్వంసం చూసి సుబ్బారావు చాలా సంతోషపడిపోయారని, అయితే పోలీసుల ఫైరింగ్‌లో ఒకరు చనిపోవడంతో సుబ్బారావు హైదరాబాద్ నుంచి పారిపోయాడని రైల్వే పోలీసులు కీలక అంశాలను నమోదు చేశారు. అల్లర్లు జరిగిన తరువాత వాట్సాప్‌లో మెస్సేజ్‌లు డిలీట్ చేయాలని కూడా ఆదేశాలిచ్చినట్టు, సాక్ష్యాలు లేకుండా చూసేందుకు ప్రయత్నించినట్టు రైల్వే పోలీసులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com