BANDH: నేడు తెలంగాణ బంద్

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బంద్ ఫర్ జస్టిస్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా నేడు బంద్ జరగనుంది. వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను బంద్ చేయనున్నారు. బీసీల గళాన్ని దేశానికి వినిపించే విధంగా తమ పోరాటం ఉంటుందని బీసీ జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. ‘హైకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టులో కేసు తేలిపోయింది.. ఇక ఉద్యమమే మిగిలింది. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలు ఒక్కటవ్వాలి. పోరుబాట పట్టాలి’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. నేడు జరిగే బీసీ రాష్ట్ర బంద్ దేశంలోనే కొత్త అధ్యయనానికి నాంది పలకాలని, దేశానికే ఒక సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ ఉండనున్నాయి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహణకు మద్దతుగా పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లలో భాగంగా ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో బీసీలు అధికసంఖ్యలో పాల్గొనాలని, విద్య, వ్యాపార వాణిజ్య రంగాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక మాత్రమేనని, బీసీల డిమాండ్లు పరిష్కరించకపోతే.. తర్వాత అగ్రవర్ణాలకు ఓట్ల బంద్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు.
76 ఏళ్లుగా బీసీలకు అన్యాయం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు అయినప్పటికీ.. బీసీలు ఇంకా తమకు దక్కాల్సిన న్యాయం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి పూర్తిగా దక్కడం లేదనే ఆవేదన బీసీ నాయకుల్లో బలంగా ఉంది. బీసీల జనాభాకు అనుగుణంగా వారికి రిజర్వేషన్లు లేకపోవడం ప్రధాన సమస్య. విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవులలో బీసీల వాటా తక్కువగా ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థలు, చట్ట సభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారి గళం బలంగా వినిపించడం లేదు. 42 శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల బీసీలు మరింత అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత రిజర్వేషన్ల అంశంపై స్టే ఇవ్వడం న్యాయం కాదనే వాదనను ఆర్. కృష్ణయ్య బలంగా వినిపించారు. ఈ అవమానాన్ని భరించలేకనే.. చట్ట సభల్లో బిల్లు పెట్టేంతవరకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.
‘బీసీల న్యాయమైన ఆకాంక్షలకు ఏర్పడ్డ అడ్డంకులను నిరసిస్తూ శనివారం రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నాం. ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బంద్ ప్రశాంత వాతావరణంలో విజయవంతమయ్యేందుకు విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలు సహకరించాలి. ఒక్క మెడికల్ షాపులు మినహా మరేవీ తెరవొద్దు’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. పోలీసు అధికారులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. శుక్రవారం బీసీ ఐకాస వైస్ ఛైర్మన్ వీజీఆర్ నారగోని, సమన్వయకర్త గుజ్జ కృష్ణల అధ్యక్షతన బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ చేపడుతున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com