బీజేపీలో మారుమోగుతున్న బండి సంజయ్‌ పేరు!

బీజేపీలో మారుమోగుతున్న బండి సంజయ్‌ పేరు!
తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన గ్రాఫ్‌ వేగంగా పెరిగిపోతోంది. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు, గ్రేటర్‌ ఎన్నికల్లో బండి సవాళ్లు, విమర్శలు తీవ్ర సంచలనమే రేపాయి.

మొన్న దుబ్బాక ఉపఎన్నికతో దుమ్మురేపారు. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీ అందుకున్నారు. దాంతో ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు బండి సంజయ్‌ పేరు మారుమోగిపోతోంది.. బండి సంజ‌య్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక త‌న‌దైన ముద్ర వేస్తున్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలతో విరుచుకుపడుతూ సరికొత్త రాజకీయంతో ముందుకెళ్తున్నారు. అటు ప్రజల్లోనూ బండి సంజయ్‌కి ప్రత్యేక స్థానం ఏర్పడింది.

తాజా పరిణామాలతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన గ్రాఫ్‌ వేగంగా పెరిగిపోతోంది. దుబ్బాక ఉపఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాలు, గ్రేటర్‌ ఎన్నికల్లో బండి సవాళ్లు, విమర్శలు తీవ్ర సంచలనమే రేపాయి. ఎదురులేదనుకున్న టీఆర్‌ఎస్‌ పెద్దలను దీటుగా ఎదుర్కొని పార్టీని నిలబెట్టారు. తద్వారా జాతీయ నాయకత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేశారనే టాక్‌ కూడా నడుస్తోంది.

ఈ విజయాల నేపథ్యంలో హైకమాండ్‌ ఆయనకు కొత్త టాస్క్‌ అప్పగించిందనే ప్రచారం జోరందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో బండి సంజయ్‌ సేవలను విస్తృతంగా వాడుకునేందుకు భారీ ప్రణాళికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న కమలనాథులు. తిరుపతిని వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది.. తిరుపతి ఉప ఎన్నిక కోసం బండి సంజయ్‌ని రంగంలోకి దింపుతున్నట్లుగా సమాచారం. మొదట సంజయ్‌తో ప్రచారం చేయించాలని భావించగా, అంతకు ముందుగానే తిరుపతి పంపి హైప్‌ తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈనెలఖారులో బండి సంజయ్ తిరుపతి టూర్‌ ఉండొచ్చని పార్టీ వర్గాలు భావించినా.. బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన పర్యటన‌ కొత్త ఏడాది మొదట్లో ఉండొచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో తిరుపతి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉండగా.. నోటిఫికేషన్‌ రాకముందే సంజయ్‌ని తిరుపతి పంపడం ద్వారా ఎన్నికల వేడిని ముందే రాజేయాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. మరోవైపు తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయాలని బీజేపీతోపాటు తన మిత్రపక్షమైన జనసేన భావిస్తోంది. అయితే, సంజయ్‌ తిరుపతి వెళ్లి వస్తే ఎవరు పోటీచేసినా బలం పెరుగుతుందనే భావనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ స్కెచ్‌ వర్కవుట్‌ అవుతుందా లేదా అన్నదానిపైనా బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేస్తూ వస్తోంది. అదేవిధంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్‌. ముఖ్యంగా మత మార్పిళ్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కమలనాథులు ఆరోపిస్తున్నారు.

తిరుమల కొండపై అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయన్న అంశాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌తో పాటు ధర్మపురి అరవింద్, రాజాసింగ్, రఘునందనరావును సైతం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారనికి పంపాలని బీజేపీ హైకమాండ్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ‌లో సక్సెస్ అయిన బండి సంజయ్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లో వర్కౌట్‌ అవుతుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story