Bandi sanjay : సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం.. !

Bandi sanjay : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఎప్పుడు జైలుకు పంపించాలి అనేదానిపై తమ వ్యూహం తమకు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పార్టీలో చేరడం సహా పలు అంశాలపై మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ పైన, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించిన వివరాలు ఇప్పటికే సేకరించామని, 18మంది ముఖ్య నేతలపై లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నామని తెలిపారు.
తమ ఉద్యమ పంథా వేరుగా ఉంటుందని, కేసీఅర్ కి సంబంధించిన సహారా, ఈఎస్ఐ కేసుల వివరాలు అన్నీ కూడా బయటకు తీస్తున్నామని చెప్పారు. అటు ఈటెల బీజేపీలో చేరడం పైన స్పందించారు.. వారం రోజుల్లో చేరిక ఉంటుందన్న ఆయన... బీజేపీ లోకి ఎవరు వచ్చినా ఎలాంటి హామీ ఉండదని స్పష్టం చేశారు. ఈటెల కూడా బీజేపీ సిద్ధాంతాలు, మోదీ పాలన నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదిక అన్న ఆయన కేసిఆర్ ను వ్యతిరేకించే వారికి బీజేపీ అండగా ఉండి పోరాడుతుందని అభయమిచ్చారు.
అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఈటెల... హైదరాబాద్ తిరిగి రాగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బీజేపీలో చేరడానికి కండిషన్ లు ఉండవంటూ ఇప్పుడు సంజయ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com