Bandi Sanjay: ముగియనున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి..

Bandi Sanjay: BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఇవాల్టితో ముగియనుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో రెండో విడత సంగ్రామ యాత్రను సంజయ్ ముగించనున్నారు. ఏప్రిల్ 14న అలంపూర్‌లో అంబేద్కర్ జయంతి సందర్భంగా రెండో విడత సంగ్రామ యాత్రను ప్రారంభించిన సంజయ్.. 31 రోజుల పాటు ఉమ్మడి పారలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 400 కిలోమీటర్లు నడిచారు.
పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు ధీటుగా అమిత్ షా సభ నిర్వహించాలని కమలనాథులు ప్రణాళికలు రచించారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు.
ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 5 వేల మందిని తరలించేలా జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. రైతులు, మహిళలు, యువత ఇలా మొత్తం 5 లక్షల మందిని సభకు తీసుకువచ్చేలా టార్గెట్ పెట్టుకున్నారు. ఇటు GHMCలో కార్పొరేటర్లకు సైతం జనసమీకరణ కోసం టార్గెట్ పెట్టింది. రైతు సంఘర్షణ సభలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్ జనాల్లోకి చేరకముందే..దాన్ని తిప్పికొట్టాలని ప్లాన్ చేస్తోంది.
తుక్కుగూడ సభలో సీఎం కేసీఆర్ టార్గెట్‌గా అమిత్ షా ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సభా ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. అమిత్ షా సభతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com