తెలంగాణాలో రెండు ఎమ్మెల్సీలు గెలుస్తాం : బండి సంజయ్

తెలంగాణాలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచినా.. రెండవ,మూడవ స్థానానికి పరిమితమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఎంత మందిపై కేసులుపెట్టారు, ఎంత డబ్బు సీజ్ చేశారో చెప్పాలని ఆయన అధికారులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.
కాగా అటు తెలంగాణాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులతోపాటు.. స్వతంత్ర అభ్యర్ధులు సైతం గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సమయం ముగియడంతో క్యూలైన్లో ఉన్నవారికి మాత్రం ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ నియోజవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 93 మంది పోటీ చేశారు. రెండు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10 లక్షలకు పైగా ఓటర్లున్నారు. కాగా ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రచారాన్ని కూడా భారీ స్థాయిలో నిర్వహించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com